ఆ రాష్ట్రాలకు ఏప్రిల్‌లో రూ.97వేల కోట్ల ఆదాయ నష్టం - states revenue loss in April
దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో 21 రాష్ట్రాలు ఏప్రిల్ నెలలో మొత్తం రూ.97,100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇండియా రేటింగ్ నివేదించింది. సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయంపై అధికంగా ఆధారపడే రాష్ట్రాలకే లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
21 రాష్ట్రాలకు ఏప్రిల్‌లో రూ.97వేల కోట్లు ఆదాయ నష్టం
By
Published : May 13, 2020, 6:42 PM IST
కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయాయి. ఈ కారణంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే దేశంలోని ప్రధాన రాష్ట్రాలు సుమారు రూ.97,100 కోట్ల ఆదాయం కోల్పోయాయని ఇండియా రేటింగ్స్ నివేదిక వెల్లడించింది.
ఇండియా రేటింగ్స్ అంచనా ప్రకారం.. నగదు చలామణి ఆగిపోయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే.. కరోనా, దానితో సంబంధం ఉన్న ఇతర అంశాల వ్యయంతో రాష్ట్రాల సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
"లాక్‌డౌన్‌తో ఉత్పత్తి, సరఫరా, వాణిజ్యంలో అంతరాయం ఏర్పడింది. విమానయాన, పర్యటక, హోటల్స్, ఆతిథ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. అయితే.. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ... రెండో త్రైమాసికం వరకు ఆర్థిక కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనటం కష్టం. ఒక్క ఏప్రిల్‌లోనే 21 ప్రధాన రాష్ట్రాలు రూ.97,100 కోట్లు నష్టపోయాయి."
- ఇండియా రేటింగ్స్ నివేదిక
ఆ రాష్ట్రాలపైనే అధిక ప్రభావం..
మొత్తం ఆదాయంలో సొంత రాబడిపై ఎక్కువగా ఆధారపడే రాష్ట్రాలపైనే లాక్డౌన్ ప్రభావం అధికంగా ఉండనుందని తేల్చింది నివేదిక. ఇందులో గోవా, గుజరాత్, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచే సుమారు 65-76 శాతం వరకు ఆదాయం పొందుతున్నాయి.
రాష్ట్రం
సొంత వనరుల నుంచి
వచ్చే ఆదాయం(శాతం)
గుజరాత్
76
తెలంగాణ
75.6
హరియాణా
74.7
కర్ణాటక
71.4
తమిళనాడు
70.4
మహారాష్ట్ర
69.8
కేరళ
69.6
గోవా
66.9
21 రాష్ట్రాల జీఎస్టీ రాబడి ఏప్రిల్ నెలకు రూ.26,962 కోట్లు, వ్యాట్ రూ. 17,895 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 13,785 కోట్లు, స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీ రూ.11,397 కోట్లు, ఆటో ట్యాక్స్ రూ.6,055 కోట్లు, విద్యుత్తుపై డ్యాక్స్ డ్యూటీస్ రూ.3,464 కోట్లుతో పాటు పన్నులేతర సొంత ఆదాయం రూ. 17,595 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది నివేదిక.
సొంత వనరుల నుంచి ఆదాయం తగ్గిపోయినప్పటికీ కేంద్రం నుంచి నిధులు వస్తాయనుకున్నా.. వాటిపైనా అనిశ్చితి నెలకొందని తెలిపింది నివేదిక. దీని కారణంగా ఆదాయం పొందేందుకు కొత్త దారులు వెతకటం, కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై ఒత్తిడి పెరుగుతుందని వివరించింది. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన చర్యలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్పిస్తాయని స్పష్టం చేసింది.
ఏడు మార్గల ద్వారా సొంత రాబడి..
రాష్ట్ర జీఎస్టీ ద్వారా 40 శాతం.
ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్‌తో 30 శాతం.
లాక్డౌన్ సమయంలో అత్యవసరాలకు అనుమతులు ఉన్న నేపథ్యంలో కేవలం 40శాతం ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో కొంత మేర ఎస్జీఎస్టీ, వ్యాట్, విద్యుత్‌పై ట్యాక్స్, డ్యూటీ రూపంలో వస్తోంది.
మే నెలలో కాస్త మెరుగు..
కొన్ని ఆంక్షలను సడలించడం వల్ల మే నెలలో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇందులో మద్యం అమ్మకాలు అనుమతించటం ప్రధానమైందని తెలిపింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఎక్సైజ్ సుంకాన్ని, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచాయని పేర్కొంది.