కొవిడ్ ప్రభావం నుంచి బయటపడాలంటే కీలకమైన వైద్యం, ఆర్థికం, నైపుణ్యాల వంటి రంగాల్లో సంస్కరణలను కొనసాగించాలని భారత్‌కు ప్రపంచ బ్యాంకు సూచించింది. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచి, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఉండాలని పేర్కొంది.
ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలను 'ఇండియా డెవలప్మెంట్ అప్డేట్' రూపంలో ద్వైవార్షిక నివేదిక విడుదల చేసింది. గత ఆరు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థపై ఈ తాజా నివేదిక ప్రధానంగా దృష్టిసారించింది. ఆర్థిక విధానాలతో పాటు భారత్ అమలు చేస్తున్న సంస్కరణలపై లోతైన విశ్లేషణ చేపట్టింది.
"మౌలిక వసతులు, భూమి, శ్రమ, మానవ మూలధనం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే దేశాలు గ్లోబల్ వాల్యూ చైన్‌కు అనుసంధానమై, అనిశ్చితులకు వెంటనే స్పందించగలుగుతాయి. ప్రపంచంలో జరిగే మార్పుల నుంచి ప్రయోజనాలను పొందగలుగుతాయి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌కు ఈ అనిశ్చితులను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడే సమయంలో మరింత పోటీతత్వంతో పనిచేసే అవకాశం వస్తుంది."
-జునైద్ అహ్మద్, వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్- ఇండియా