2024-25 కల్లా దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది భాజపా ప్రభుత్వం. ఇటీవలే ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సంకల్పానికి పునాదిగా అభివర్ణించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.
వినియోగం పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టబడుల ద్వారా ఆస్తులు కూడబెట్టడం వంటివాటిపై దృష్టి సారించినట్లు కోల్కతాలో నిర్వహించిన సమావేశంలో ఆమె పేర్కొన్నారు.
అదే విధంగా జీఎస్టీ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి కాకుండా.. ఏడాదిలో ఒకసారి నిర్వహించే విదంగా హేతుబద్దీకరించాలని జీఎస్టీ మండలికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల సమస్యల గురించి మాట్లాడుతూ.. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు 16 ప్రధాన 'యాక్షన్ పాయింట్ల'ను పద్దులో ప్రకటించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇవన్నీ కలిసి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు ఉపయోగపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.