కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న తరుణంలో వృద్ధులకు జీవన ప్రమాణ పత్రం విషయంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వెసులుబాటు కల్పించింది. నెలవారీ పింఛను పొందేందుకు సమర్పించాల్సిన ఈ జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫికేట్) దాఖలుకు ఈ సారి.. 2021 ఫిబ్రవరి 28 వరుకు గడువు పెంచింది.
నిబంధనల ప్రకారం జీవన ప్రమాణ పత్రం ఏటా నవంబర్ 30లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఇది సమర్పించిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.
జీవన ప్రమాణ పత్రం అంటే?
పింఛనుదారుడు బతికే ఉన్నారని తెలిపేందుకు ఉద్దేశించినదే ఈ జీవన ప్రమాణ పత్రం. ఇది బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఆధార్, బయోమెట్రిక్‌ను ఉపయోగించి దీనిని పొందవచ్చు.
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఉద్యోగ విరమణ అయిన అనంతరం పింఛను పొందేందుకు ఖాతా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జీవన ప్రమాణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.
జీవన ప్రమాణ పత్రం ఎలా పొందవచ్చు?
పింఛను పంపిణీ చేసే బ్యాంకు, పోస్టాఫీసులలో వ్యక్తిగతంగా పింఛనుదారుడు హాజరుకావటం ద్వారా పొందవచ్చు. విధులు నిర్వహించిన కార్యాలయం నుంచి కూడా ఈ జీవన ప్రమాణ పత్రాన్ని పొందొచ్చు.
పూర్తి డిజిటల్ ప్రక్రియ ద్వారా కూడా ఈ ప్రమాణ పత్రాన్ని పొందవచ్చు. దీన్ని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(డీఎల్సీ) అంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సిటిజన్ సర్వీస్ సెంటర్లు, పోస్టాఫీసులు, బ్యాంకులు, ట్రెజరీ లాంటి ఫించను పంపిణీ సంస్థలతోపాటు సొంత కంప్యూటర్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
ఈ సంవత్సరం నుంచి ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈపీఎస్ పింఛనుదారులు ఈ డీఎల్‌సీని పొందవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఇంటి వద్దే డీఎల్సీ అందించే సేవలను ప్రారంభించింది. నామమాత్రం ఫీజు చెల్లించి ఆన్ లైన్ ద్వారా ఈ సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం పోస్ట్‌మ్యాన్ పింఛనుదారుడి ఇంటికి వచ్చి డీఎల్సీ ప్రక్రియ పూర్తి చేస్తారు.