డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి జపాన్ వార్షిక వృద్ధి రేటు 12.7 శాతానికి పుంజుకుంది. మూడో త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదు కావడం వల్ల.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల్లో పైకి ఎగబాకింది. కరోనా నేపథ్యంలో అంతకుముందు త్రైమాసికాల్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు, దేశవ్యాప్తంగా వినిమయం పుంజుకోవడం వల్లే వృద్ధి నమోదైందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2020లో జపాన్ వృద్ధి రేటు 4.8 శాతం కుంగింది. గత 11 ఏళ్లలో ఆ దేశ వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.
కరోనా సంక్షోభంలోనూ జపాన్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించలేదు. ఇంటి నుంచి పని, సామాజిక దూరం పాటించడం వంటి నియమాల్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో కొత్త రకం కరోనా భయాలతో టోక్యో సహా మరికొన్ని ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు. దీంతో ప్రస్తుత త్రైమాసికంలో మరోసారి వృద్ధి రేటు నెమ్మదించొచ్చని ఆ దేశ ఆర్థిక నిపుణుడు జునిచి మకినో అంచనా వేశారు. అయితే, ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిలోకి వస్తున్న నేపథ్యంలో జపాన్ వృద్ధి రేటుకు దన్ను లభించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తృతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కలిసివస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.