2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించి పరిశీలన(స్క్రూట్నీ) కోసం ఎంపిక చేసిన ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లు భారీగా తగ్గాయి. దాఖలైన మొత్తం ఐటీఆర్‌లలో 0.25 శాతం పరిశీలనకు ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకు ముందు 2017-18 మదింపు సంవత్సరంలో ఇవి 0.55 శాతంగా ఉన్నాయి.
గతంలో చూస్తే పరిశీలన కోసం ఎంపిక చేసిన ఐటీఆర్‌లు.. 2015-16లో 0.71 శాతం, 2016-17లో 0.40 శాతంగా ఉన్నాయి.
అయితే ఈ ఏడాది మొత్తం ఎన్ని ఐటీఆర్‌లను పరిశీలనకు (సంఖ్యా పరంగా) తీసుకున్న విషయం మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.
పన్ను చెల్లింపుదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ఆదాయ శాఖ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏటా పరిశీలనకు ఎంపిక చేసే ఐటీఆర్‌ల సంఖ్యను కూడా తగ్గిస్తూ వస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.