తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 8:15 PM IST

Updated : Jun 21, 2021, 9:38 AM IST

ETV Bharat / business

పసిడి ధర పెరుగుతుందా? పెట్టుబడి పెట్టొచ్చా?

గతేడాది బంగారం ధర ఆకాశాన్నంటింది. జీవన కాల గరిష్ఠాన్ని కూడా తాకింది. అప్పటి నుంచి బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇటీవల కొంత పెరిగినా.. కొన్ని రోజుల నుంచి మళ్లీ తగ్గుతోంది. ఇలాంటి సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా? ప్రస్తుతం పసిడి ధరల తగ్గుదలపై నిపుణులు ఏమంటున్నారు?

Is this the right time to invest in gold?
పసిడిపై పెట్టుబడులకు ఉత్తమ సమయం

బంగారం భారతీయ మహిళలకు అత్యంత ఇష్టమైన లోహం. ఇష్టపడి కొనుగోలు చేసినప్పటికీ.. కష్టకాలంలో ఆదుకోవటం అనేది దీని వెనుక అసలు కారణం. ఇప్పుడు బంగారం కొనుగోలు తీరు మారిపోయింది. ఒకప్పుడు భౌతికంగా మాత్రమే కొనుగోలు చేసేవారు. అదే ఇప్పుడు పెట్టుబడిగా కూడా బంగారం ఉపయోగపడుతోంది. అంతేకాకుండా మంచి రాబడిని కూడా అందిస్తోంది.

గత కొన్ని రోజులుగా బంగారం ధర మళ్లీ తగ్గుతోంది. హైదరాబాద్​లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.48,420 వద్ద ఉంది. గతేడాది ఆగస్టులో జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.57వేల వద్దకు చేరిన పసిడి ధర.. 2021 మార్చిలో రూ.45 వేలకు పడిపోయింది. జూన్ మొదటి వారంలో మళ్లీ రూ.50వేల స్థాయికి చేరుకుంది.

డాలర్ విలువ కీలకం..

సాధారణంగా డాలర్ బలపడుతున్నప్పుడు బంగారం ధర తగ్గుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడుతోంది. పసిడి ధర తగ్గుదలకు ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కమోడిటీస్​లో ధరలు తగ్గుతున్నాయి. ఇది కూడా బంగారం ధర తగ్గుదలకు కలిసి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ ప్రకటన ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా డాలరుతో పోల్చితే రూపాయి విలువ తగ్గింది. కాబట్టి రూపాయి పరంగా చూసుకుంటే బంగారం ధర ఎక్కువగా తగ్గలేదు. అదే డాలరులో చూసుకుంటే ఇంకా ఎక్కువగా కరెక్షన్ కన్పించింది.

"ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం ధర పెరుగుతుంటుంది. డాలర్ బలహీన పడినప్పుడు కూడా బంగారం ధర పెరుగుతుంది. మొన్నటి వరకు ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే రాగి, స్టీల్​ తదితర కమోడిటీస్​లో కరెక్షన్ చూస్తున్నాం. డాలర్ మొన్నటి వరకు బలహీనపడింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. ఈ రెండు కారణాల వల్ల బంగారం ధర కూడా పెరుగుతోంది."

-సతీశ్ కంతేటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ

స్వల్ప కాలంలో ప్రతికూలతలు..

స్వల్ప కాలంలో బంగారం ధరల తగ్గుదల ఉన్నప్పటికీ.. ఈ తీరు రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ధరల్లో ఇంకా కొంచెం బలహీనత ఉండవచ్చని.. అయితే ధర తగ్గినప్పుడు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగించాలి అనుకున్నప్పుడు.. స్వల్ప, మధ్యకాల బలహీనతను ఉపయోగించుకోవాలని వారు చెబుతున్నారు. స్వల్ప కాలంలో కమోడిటీ ధరలు ఇంకా తగ్గవచ్చు. అంతేకాకుండా డాలర్ ఇంకా బలపడవచ్చు. కాబట్టి బంగారం ఇంకా కొంత బలహీనంగా ఉండి తర్వాత రికవరీ కావచ్చు అని అంచనా వేస్తున్నారు.

"స్పల్ప కాలంలో బలహీనత కొనసాగవచ్చు. దీన్ని ఉపయోగించుకుని దీర్ఘకాలం ఆలోచన ఉన్న వారు కొనుగోలు చేయవచ్చు. బంగారంలో పెట్టుబడులు తక్కువున్నట్లయితే ఈ ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఎక్కువ పెట్టుబడులు ఉన్న వారు అయితే మరింత కరెక్షన్ కోసం ఎదురుచూడవచ్చు. స్వల్ప కాలంలో బంగారం బలహీనంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది"

-సతీశ్​ కంతేటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ

గతేడాది అగస్టులో బంగారం రూ.57,000 వద్దకు చేరింది. ఇప్పుడు రూ.48 వేల వద్ద ఉన్నప్పటికీ.. బాగా తగ్గిన పరిస్థితి కనపించటం లేదని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప కాలంలో డాలర్ బలపడటం, కమోడిటీస్ ధరలు తగ్గుదల లాంటి ప్రతికూలతలు ఉన్నాయని.. ఇంకా కొంత తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అయితే మొత్తంగా డైరెక్షనల్​గా తీసుకుంటే మాత్రం పెరిగే పరిస్థితి ఉందని వారు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 21, 2021, 9:38 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details