ప్రస్తుతం చాలా మందికి జీవిత బీమా అనగానే టర్మ్ పాలసీల వైపు చూస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇవి చాలా పాపులర్ అయ్యాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందిస్తుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా వేతన జీవులకు ఇవి చాలా అనువుగా ఉండే పాలసీలు.
టర్మ్ పాలసీల్లో రెండు రకాలున్నాయి. ఒకటి సాధారణ పాలసీ. ఇందులో బీమాదారుడు చెల్లించిన ప్రీమియం మళ్లీ తిరిగిరాదు. రెండోది 'రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ పాలసీ' ఇందులో బీమా పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు మీకు ఎలాంటి ప్రమాదం జరగనట్లైతే, మీరు పాలసీ కోసం చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి పొందగలరు. బీమా గడువు ముగియగానే పన్నులు మినహా చెల్లించిన మొత్తం తిరిగి పాలసీదారుడికి అందుతుంది. ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఆర్ఓపీ కన్నా.. సాధారణ టర్మ్ పాలసీ ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ టర్మ్ పాలసీలతో పోలిస్తే.. రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీల విషయంలో ప్రీమియం దాదాపు రెండు నుంచి మూడు రెట్లు ఉంటోందని వారు అంటున్నారు. దీని ఆధారంగా ఆర్ఓపీ పాలసీ అంతర్గతంగా సాధారణ టర్మ్ప్లాన్తో పాటు పెట్టుబడి ప్లాన్ కూడా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చని వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు.
రాబడి చాలా తక్కువ..
రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో మెచ్యురిటీ అనంతరం పొందేది చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో తక్కువగా లేదా 4 నుంచి 5 శాతం రాబడితో మాత్రమే వస్తోంది. గడువు ఎక్కువుండే పాలసీల విషయంలో మెచ్యురిటీ అనంతరం వచ్చే రాబడి ఇంకా తక్కువగా ఉంటోంది.