కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాది పర్యటక రంగం 60- 80 శాతం మేర క్షీణిస్తుందని ప్రపంచ పర్యటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) అంచనా వేసింది. ఫలితంగా 9.1 లక్షల కోట్లు- 1.2 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లనుందని లెక్కగట్టింది.
2019 గణాంకాలతో పోలిస్తే కనిష్ఠంగా 60 శాతం నష్టం వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడింది యూఎన్‌డబ్ల్యూటీఓ. దీని వల్ల లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం పడుతుందని వెల్లడించింది.
2020 తొలి త్రైమాసికంలో అంతర్జాతీయ పర్యటకుల రాక 22 శాతం పడిపోయిందని ఈ ఐరాస అనుబంధ సంస్థ తెలిపింది. అన్ని దేశాలు లాక్డౌన్ విధించిన కారణంగా ఒక్క మార్చి నెలలోనే 57 శాతం పతనమైందని తెలిపింది.
ఆసియాలోనే అధికం..
అంతర్జాతీయ అరైవల్స్‌లో 6.7 కోట్లు తగ్గిపోగా పర్యటక ఎగుమతులకు సంబంధించి 80 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు నివేదించింది. ప్రాంతాలవారీగా చూస్తే.. ఆసియా పసిఫిక్‌లో 3.3 కోట్లు, ఐరోపా 2.2 కోట్ల మంది పర్యటకులు తగ్గారు.
గరిష్ఠంగా 78 శాతం..
ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని.. పర్యటక రంగంలో నష్టాలను 3 దశల్లో అంచనా వేసింది యూఎన్‌డబ్ల్యూటీఓ. జులైలో ఆంక్షలు సడలిస్తే 58 శాతం, సెప్టెంబరులో సడలిస్తే 70 శాతం, డిసెంబర్ వరకు వేచి చూస్తే 78 శాతం నష్టం తప్పదని స్పష్టం చేసింది.
అయితే అంతర్జాతీయ డిమాండ్‌తో పోలిస్తే దేశీయంగా పర్యటకం త్వరగా కోలుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:రైళ్లలో వారు ఊరెళ్లడం ఇక మరింత ఈజీ