టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఇటీవల పెరిగిన డిమండ్‌తో.. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ).. బీమా సంస్థలన్నీ ప్రామాణిక వ్యక్తిగత టర్మ్ పాలసీతో ముందుకు రావాలని సూచించింది. దీనికి 'సరళ్ జీవన్ బీమా'గా పేరు పెట్టింది. జనవరి 1 నాటికి ఈ పాలసీలు అందుబాటులోకి తీసుకురావాలని బీమా కంపెనీలకు సూచించింది ఐఆర్డీఏఐ.
ప్రామాణిక బీమా అంటే?
ప్రామాణిక బీమా అంటే.. బీమా సంస్థతో నిమిత్తం లేకుండా పాలసీలో ఓకే విధమైన ప్రయోజనాలు, ఫీచర్లు, నిబంధనలు ఉంటాయని అర్థం. అయితే మార్కెట్లో పోటీ కోసం ఈ పాలసీకి బీమా కంపెనీలే ప్రీమియాన్ని నిర్ణయించుకునే వీలుంటుంది.
ఈ పాలసీ అవసరమెంత?
ఇలాంటి పాలసీ అవసరాన్ని వివరిస్తూ.. ఐఆర్డీఏఐ ఈ నెల 15న ఓ ప్రకటన విడుదల చేసింది. 'ప్రస్తుతం వేర్వేరు నిబంధనలతో మార్కెట్లో అనేక టర్మ్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మందికి పాలసీ నిబంధనలు, ఫీచర్లను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం, సామర్థ్యాలు ఉండటం లేదు. దీనితో చాలా మంది తమకు తగిన సరైన పాలసీని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు' అని పేర్కొంది. ఈ నేపథ్యంలో సరళమైన ఫీచర్లు, నిబంధనలతో ప్రామాణిక వ్యక్తిగత టర్మ్ జీవిత బీమా తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించింది ఐఆర్డీఏఐ. దీనితో వినియోగదారులకు పాలసీ ఎంపిక సులభరతం అవుతుందని తెలిపింది. బీమా సంస్థలకు బీమాదారులకు మధ్య పరస్పర నమ్మకం కూడా పెరుగుతుందని వివరించింది. పాలసీల విక్రయాల్లో తలెత్తే పొరపాట్లు, క్లెయిమ్ సమయంలో ఏర్పడే వివాదాలకు కూడా.. సరళ్ జీవన్ బీమా పాలసీతో చెక్ పడుతుందని పేర్కొంది.
సరళ్ బీమాకు ఐఆర్డీఏఐ సూచించిన ఫీచర్లు ఇవి..
ఏమిటీ ప్రొడక్ట్?
సరళ్ జీవన్ బీమా అనేది వ్యక్తిగత రిస్క్ ప్రీమియం జీవిత బీమా. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదంతో మరణిస్తే నామినీకి.. హామీ ఇచ్చిన నగదు మొత్తాన్ని ఏక కాలంలో చెల్లిస్తాయి బీమా కంపెనీలు.
బీమా సంస్థ పేరుతో.. పాలసీ పేరును కలిపి విక్రయిస్తారు. ఉదాహరణకు భారతీ యాక్సా లైఫ్ సరళ్ జీవన్ బీమా, హెచ్డీఎఫ్సీ లైఫ్ సరళ్ జీవన్ లాంటివి.
కీలక ఫీచర్లు..
18 నుంచి 65 ఏళ్లలోపు ఎవరైనా ఈ బీమా తీసుకోవచ్చు. లింగ భేదం, నివాస స్థలం, వృత్తి, విద్యార్హతలు వంటి వాటితో సంబంధం లేదు. బీమా కవర్ కనీసం రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూర.25 లక్షలుగా ఉంటుంది.
బీమా సంస్థలు రూ.25 లక్షల కన్నా ఎక్కువ మొత్తానికి హామీ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది ఐఆర్డీఏఐ. ఇతర నిబంధనలను మాత్రం అలానే ఉంచింది.