జులై నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు చేరుకుంటుందని, కానీ కొంత కాలం పాటు 5 శాతానికి పైనే కొనసాగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ తెలిపారు. ఆర్బీఐ నిర్దేశించుకున్న ధరల ప్రమాణాలను అధిగమించి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వస్తు రవాణాలో సమస్యల వల్ల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం గత మూడు వరుస త్రైమాసికాల్లో భారీగా నమోదైనట్లు తెలిపారు.
పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు సుబ్రమణియన్.
" ప్రస్తుతం ఉన్న కారణాలతో ఈ నెలలో ద్రవ్యోల్బణం 6 శాతంలోపు దిగివస్తుందని భావిస్తున్నా. మే నెలలో ద్రవ్యోల్బణం 6.4 శాతంగా నమోదైంది. నియంత్రణ సంస్థలు తీసుకునే చర్యల ద్వారా అది మరింత దిగివచ్చే అవకాశం లేకపోలేదు. కరోనా మహమ్మారి తొలి దశ సుదీర్ఘకాలం కొనసాగటం వల్ల 2021 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం పడింది. అయితే.. రెండో దశలో దశల వారీగా లాక్డౌన్ పెట్టటం వల్ల అంతగా ప్రభావం లేదు. కాస్త కోలుకున్నట్లు తెలుస్తోంది."
- కేవీ సుబ్రమణియన్, ముఖ్య ఆర్థిక సలహాదారు.
దేశ వృద్ధి రేటు ఆర్థిక శాఖ అంచనా వేసినట్లుగా 10.5 శాతం పరిధిలోనే ఉండొచ్చని తెలిపారు సుబ్రమణియన్. కరోనా రెండో దశ కేవలం 6-8 వారాలే ఉంటుందని, తొలి దశలో మాదిరిగా జీడీపీ వృద్ధి రేటును అంతగా ప్రభావితం చేయకపోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధి రేటును తగ్గించటంపై ప్రభుత్వ నిర్ణయాలే కారణంగా తెలిపారు. సరైన అంచనాలను అందించలేకపోయినట్లు చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు వీ ఆకారంలో గణనీయంగా పుంజుకున్నట్లు తెలిపారు.
2022 ఆర్థిక ఏడాదిలో ద్రవ్య లోటును 6.7 శాతానికి మించకుండా ప్రభుత్వ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు సుబ్రమణియన్. అయితే.. ఇది ప్రభుత్వ వ్యయాలపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు.
ఆగస్టు 4 నుంచి..
జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు ఆర్బీఐ. అయితే.. ఇటీవల సమాచారం మేరకు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 4-6 మధ్య ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది.
ఇదీ చూడండి:పారిశ్రామిక ఉత్పత్తి భేష్- ద్రవ్యోల్బణం ఫ్లాట్