తెలంగాణ

telangana

ETV Bharat / business

జూన్​లో తగ్గిన నిరుద్యోగిత రేటు.. వృద్ధికి సంకేతమా? - పట్టణాల్లో నిరుద్యోగిత రేటు

దేశంలో లాక్​డౌన్​ సడలింపులతో నిరుద్యోగ సమస్య కాస్త తగ్గుతోంది. నిరుద్యోగిత రేటు తగ్గుదల.. ఆర్థిక వృద్ధికి సంకేతాలుగా కొంత మంది భావిస్తున్నారు. అయితే నిరుద్యోగ సమస్య తగ్గేందుకు కారణాలు ఏమిటి? నిజంగానే ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందా? అనే విషయాలపై నిపుణుల విశ్లేషణలు మీకోసం.

India's unemployment rate falling
దేశంలో నిరుద్యోగత రేటు

By

Published : Jul 7, 2020, 5:25 PM IST

లాక్​డౌన్​ సడలింపులతో దేశవ్యాప్తంగా జూన్​లో నిరుద్యోగ సమస్య కాస్త తగ్గినట్లు సెంటర్​ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) డేటాలో వెల్లడైంది. దీని ప్రకారం జూన్​ నెలాఖరుకు దేశంలో నిరుద్యోగిత రేటు 11 శాతంగా ఉంది. అంతకు ముందు నెలలో (మేలో) ఇది 23.5 శాతంగా ఉంది.

నిరుద్యోగిత రేటు జూన్​లో గ్రామీణ ప్రాంతాల్లో 10.5 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 12 శాతానికి తగ్గింది. మే నెలలో ఇవి వరుసగా 22.5 శాతం, 25.8 శాతంగా ఉన్నాయి.

జూన్​లో నిరుద్యోగిత రేటు తగ్గడం.. ఆర్థిక వృద్ధికి సంకేతాలుగా భావిస్తున్నారు కొంత మంది. నిజానికి సీఎంఐఈ డేటాను పరిశీలిస్తే ఇంకా ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో నిరుద్యోగిత రేటు గ్రాఫ్​

ఉద్యోగాల నాణ్యత..

సీఎంఐఈ డేటా ప్రకారం ఏప్రిల్​లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీటిలో మే నెలలో 2.1 కోట్లు, జూన్​లో మరో 7 కోట్లు రికవరీ అయినట్లు తెలిసింది.

అయితే రికవరీ అయిన 7 కోట్ల ఉద్యోగాల్లో.. 39 లక్షలు (5.5 శాతం) మాత్రమే వేతన జీవులు ఉన్నారు. మిగతవారంతా అసంఘటిత రంగాలకు చెందిన వారు కావడం గమనార్హం. మొత్తం మీద ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 1.8 కోట్ల మంది వేతన జీవులు ఉద్యోగం కోల్పోయినట్లు సీఎంఐఈ డేటా ద్వారా తెలుస్తోంది.

ఉద్యోగాల రికవరీకి కారణం..

దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు రికవరీ ఒక్క సారిగా పెరెగేందుకు అసలు కారణం లాక్​డౌన్ సడలింపులతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం కావడం వల్లేనని సీఎంఐఈ ఇటీవలి నివేదికలో పేర్కొంది.

ఏప్రిల్-మేలో నిరుద్యోగ సమస్య గరిష్ఠ స్థాయికి చేరి.. జూన్​లో కాస్త తగ్గుతుందని ముందుగానే అంచనా వేసినట్లు అజీమ్ ప్రేమ్​జీ యూనివర్సిటీ, సెంటర్​ ఫర్ సస్టేనబుల్ ఎంప్లాయ్​మెంట్ విభాగాధిపతి అమిత్ బాసోల్ తెలిపారు. అయితే ఉద్యోగాలు రికవరీ అయినా.. నాణ్యత విషయంలో ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పుకొచ్చారు. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లడం, ఫ్యాక్టరీలు తెరుచుకోకపోడం వల్ల ఇంకా చాలా మంది పరిస్థితి మెరుగుపడలేదని అన్నారు.

నిరుద్యోగిత సమస్య ఇంకా అధికమే..

నిరుద్యోగిత రేటు జూన్​లో కాస్త తగ్గినప్పటికీ ఇంకా ఆందోళనకర స్థితిలోనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.

జూన్​లో నిరుద్యోగిత రేటు తగ్గడం మంచి పరిణామమే అయినా.. లేబర్ మార్కెట్​లో దీర్ఘకాలిక సమస్యలు ఇంకా అలానే ఉన్నాయని బాసోల్​ అన్నారు. వీటిని అధిగమించేందుకు ప్రత్యేకమైన పాలసీలు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 6.1 శాతానికి పెరిగింది. ఈ విషయంపై 2019 జనవరిలో వచ్చిన అంచనాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి. ఇది 45 ఏళ్లలోనే అత్యధిక స్థాయి అని అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీయడం గమనార్హం.

ఇదీ చూడండి:'కరోనా'కు బీమా తీసుకోవాలా? ఇవి తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details