తెలంగాణ

telangana

ETV Bharat / business

2020-21లో భారత వృద్ధి రేటు '0'! - కరోనా తాజా వార్తలు

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు సున్నాకు చేరుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ అంచనా వేసింది. కరోనా కారణంగా.. ఆర్థిక రంగం బలహీనమవడం, ద్రవ్యలోటు పెరిగిపోవడమే ప్రధాన కారణాలుగా తన నివేదికలో పేర్కొంది. అయితే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి గణనీయంగా పెరిగి 6.6 శాతానికి చేరొచ్చని విశ్లేషించింది.

India's rating outlook reflects rising risk of slower GDP growth
ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి '0'!

By

Published : May 8, 2020, 5:13 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను మరోసారి తగ్గించింది ప్రముఖ రేటింగ్స్​ సంస్థ మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​. జీడీపీ వృద్ధి రేటు సున్నాకు పడిపోతుందని తన నివేదికలో పేర్కొంది. 2019-20లో 4.8 శాతంగా నమోదవుతుందన్న అంచనాలను ఈమేరకు మరోసారి సవరించింది. 2020 క్యాలెండర్​ ఇయర్​లో 0.2 శాతం వృద్ధి నమోదవుతుందని గత నెలలో అంచనా వేసింది మూడీస్​.

ద్రవ్యలోటు పెరిగిపోవడం, అధిక ప్రభుత్వ రుణం, సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాల కొరత, బలహీనమైన ఆర్థిక రంగమే ఇందుకు ప్రధాన కారణాలుగా వివరించింది మూడీస్. ఆర్థిక, సంస్థాగత అంశాల్లో బలహీనమైన విధానం కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది.

గ్రామీణుల్లో ఆర్థిక ఒత్తిడి, తక్కువ ఉత్పాదకత, ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల గత కొన్నేళ్లుగా భారత వృద్ధిరేటు తగ్గతూ వస్తోందని మూడీస్​ పేర్కొంది. 2021-22లో మాత్రం దేశ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

అన్నీ ఒకే బాటలో..

లాక్​డౌన్​ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. పలు దేశీయ, అంతర్జాతీయ రేటింగ్​ సంస్థలు వృద్ధి రేటు అంచనాల్ని తగ్గిస్తూ వస్తున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్​), ప్రపంచ బ్యాంకు కూడా భారత వృద్ధి రేటు అంచనాలను గణనీయంగా తగ్గించాయి. 2020లో జీడీపీ వృద్ధి.. తొలుత జనవరిలో అంచనా వేసిన 5.8 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గించింది ఐఎఫ్​ఎఫ్​.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 1.5 నుంచి 2.8 శాతం మధ్యలో నమోదవుతుందని లెక్కగట్టింది ప్రపంచ బ్యాంకు.

ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 0.8 శాతంగా ఉంటుందని ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ అంచనా వేయగా.. ఎస్​ అండ్​ పీ మాత్రం 1.8 శాతం నమోదవ్వచ్చని అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details