దేశీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య పసిడి డిమాండ్ 140 టన్నులకు పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. 2020 ఇదే సమయంతో(102 టన్నులు) పోలిస్తే పసిడి ఈ డిమాండ్ 37 శాతం పుంజుకున్నట్లు తెలిపింది. కరోనా ఆంక్షల సడలింపు, గత ఏడాదితో పోలిస్తే ధరలు దిగిరావడం వంటివి డిమాండ్ పెరిగేందుకు కారణమైనట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది.
విలువ పరంగా చూస్తే పసిడి డిమాండ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 57 శాతం పెరిగి.. రూ.58,800 కోట్లకు చేరినట్లు డబ్ల్యూజీసీ వివరించింది. 2020 క్యూ1లో ఇది రూ.37,580 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
డబ్ల్యూజీసీ నివేదికలోని మరిన్ని వివరాలు..
- బంగారు ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 102.5 టన్నులకు పెరిగింది (రూ.43,100 కోట్లు). 2020లో ఇది 73.9 (రూ.27,230) టన్నులుగా ఉంది.
- పసిడిపై పెట్టుబడులు కూడా 2021 క్యూ1లో 37.5 టన్నులకు పెరిగాయి. 2020 క్యూ1లో పసిడిపై పెట్టుబడులు 28.1 టన్నులుగా ఉన్నాయి. 2021 జనవరి మార్చి మధ్య మొత్తం రూ.15,780 కోట్లు పసిడిపై పెట్టుబడిగా పెట్టారు మదుపరులు. గత ఏడాది ఇదే సమయంలో రూ.10,350 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.
- బంగారం రీసైకిల్ మాత్రం ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (2020తో పోలిస్తే) 20 శాతం తగ్గింది. 14.8 టన్నుల పసిడి మాత్రమే రీసైకిల్ అయ్యింది.