తెలంగాణ

telangana

ETV Bharat / business

2021లో భారత వృద్ధి రేటు -10.5%: ఫిచ్​ - భారత జీడీపీ వృద్ధి రేటు

భారత్​లో కరోనా లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో జీడీపీ పతనమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను -10.5 శాతానికి కుదించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్​.

gdp
జీడీపీ

By

Published : Sep 8, 2020, 5:07 PM IST

దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలం కొనసాగిన లాక్​డౌన్​తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. కరోనా భయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్​ భారీగా కుదించింది.

2021లో తొలుత 5 శాతం క్షీణత నమోదువుతుందని అంచనా వేసిన ఫిచ్​.. ఇటీవలి నివేదికల ఆధారంగా తాజాగా -10.5 శాతానికి సవరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత జీడీపీ రికార్డు స్థాయిలో 23.9 శాతం పతనమైందని ప్రస్తావించింది.

పుంజుకునే అవకాశం.. కానీ

అయితే, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ నేపథ్యంలో రెండో త్రైమాసికంలో తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఫిచ్. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం రికవరీని జటిలం చేసే అవకాశం ఉందని తెలిపింది.

రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్)లో -9.6 శాతం, మూడో త్రైమాసికం (అక్టోబర్​- డిసెంబర్​)లో -4.8 శాతం, చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 4 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది ఫిచ్​.

ఇండియా రేటింగ్స్ ఇలా..

మరో ప్రముఖ ఏజెన్సీ.. ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్​ కూడా 2021 ఆర్థిక వృద్ధి రేటు అంచనాను సవరించింది. తొలుత - 5.3 శాతంగా అంచనా వేసిన ఇండియా రేటింగ్స్​.. దానిని -11.8 శాతానికి కుదించింది. అయితే, 2021తో పోలిస్తే 2022లో 9.9 శాతం పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్​, టోకు ద్రవ్యోల్బణం వరుసగా 5.1 శాతం, -1.7 శాతంగా ఉంటాయని అంచనా వేసింది ఇండియా రేటింగ్స్​.

జీడీపీ క్షీణతలో రికార్డు..

కరోనా సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్​-జూన్​)లో జీడీపీ 23.9శాతం క్షీణించింది. కరోనాను కట్టడి చేసేందుకు మార్చి 25న కఠినమైన లాక్​డౌన్​ను విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏప్రిల్​ 20 నుంచి ఆంక్షల్లో సడలింపులు చేస్తూ వస్తోంది.

నియామకాలపై ప్రభావం..

కరోనా సంక్షోభంతో ఉద్యోగవకాశాలు 15 ఏళ్ల కనిష్ఠానికి తగ్గినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. వచ్చే మూడు నెలల్లో కొత్త సిబ్బంది నియామకానికి 3 శాతం కంపెనీలే ఆసక్తితో ఉన్నట్లు 'మ్యాన్​పవర్​ గ్రూప్​ ఎంప్లాయిమెంట్​ అవుట్​లుక్'​ సర్వే తెలిపింది.

జీతాల పెంపునకు 7 శాతం సంస్థలు మొగ్గు చూపగా.. 3 శాతం తగ్గించేందుకు చూస్తున్నట్లు నివేదించింది. 54 శాతం కంపెనీలు జీతాల్లో ఎలాంటి మార్పు కోరుకోవటం లేదని తెలిపింది.

నియామకాల విషయంలో కరోనాకు ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించాలని 44 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఈ విషయంలో 42 శాతం కంపెనీలు అస్పష్టంగా ఉన్నాయి. అయితే తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించాలని 42 శాతం సంస్థలు భావిస్తున్నట్లు సర్వే నివేదించింది.

ఇదీ చూడండి:కరోనా దెబ్బకు జీడీపీ 23.9% క్షీణత

ABOUT THE AUTHOR

...view details