తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా వల్ల 11 ఏళ్ల వెనక్కి దేశార్థికం - భారత్​ జీడీపీపై కరోనా ప్రభావం

కరోనా వైరస్​ కారణంగా 2020 జనవరి- మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా 2019- 20 ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ఠం వద్ద.. 4.2 శాతానికి పరిమితమైందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.

covid hit Indian Economy badly
ఆర్థిక వ్యవస్థపై కరోనా దెబ్బ

By

Published : May 30, 2020, 7:10 AM IST

Updated : May 30, 2020, 8:31 AM IST

దేశ ఆర్థిక వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 4.2 శాతంగా నమోదైంది. 2018-19 నాటి 6.1 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత స్తబ్దతకు గురైంది కూడా ఇప్పుడే. వినియోగం, పెట్టుబడులు తగ్గడం ఇందుకు నేపథ్యం. నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధి రేటు 3.1 శాతానికి పరిమితం అయినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19 చివరి త్రైమాసికంలో వృద్ధి 5.7 శాతంగా నమోదు కావడం గమనార్హం లాక్‌డౌన్‌ ప్రభావం గట్టిగా ఉన్న ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి జీడీపీ గణాంకాలు మరింత అధ్వానంగా వెలువడే ప్రమాదం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

అంచనాల కంటే తక్కువగా..

ఆర్‌బీఐ అంతక్రితం 2019-20 ఏడాదికి వృద్ధి రేటు 5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) కూడా తన తొలి(జనవరి), రెండో(ఫిబ్రవరి) ముందస్తు అంచనాల్లో 5 శాతంగానే అంచనా వేసింది. ఈ అంచనాల కంటే కూడా తాజాగా వెల్లడించిన జీడీపీ వృద్ధి గణాంకాలు తక్కువగానే ఉండటం గమనార్హం.

సవరణలు..

అక్టోబరు-డిసెంబరు 2019-20లో వృద్ధి గణాంకాలను 4.7 శాతం నుంచి 4.1 శాతానికి సీఎస్‌ఓ సవరించింది. అలాగే తొలి, రెండో త్రైమాసికాలకు సంబంధించిన గణాంకాలను సైతం వరుసగా 5.6%, 5.1% నుంచి 5.2%, 4.4 శాతానికి మార్పులు చేసింది.

పెరిగిన తలసరి ఆదాయం: 2019-20లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రూ.1,34,226గా నమోదైంది. 2018-19లో నమోదైన రూ.1,26,521తో పోలిస్తే 6.1% పెరగడం విశేషం.

ద్రవ్యలోటు 4.6 శాతానికి: గత ఆర్థిక సంవత్సరం దేశ ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతానికి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ఠ స్థాయి. ఆదాయ వసూళ్లు అధ్వానంగా ఉండడం ఇందుకు నేపథ్యం. ప్రభుత్వం సవరించిన అంచనాలైన 3.8 శాతం కంటే కూడా ఇది ఎక్కువే.

చైనాలో -6.8 శాతం

కొవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చిలో చైనా వృద్ధి 6.8 శాతం క్షీణించింది. కాగా.. భారత్‌ జీడీపీ ప్రస్తుత ఏడాది (2020-21)లో 4 దశాబ్దాల్లోనే కనీవినీ ఎరుగని రీతిలో 5% క్షీణించవచ్చని ఫిచ్‌, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థలు అంచనా వేశాయి.

కీలక రంగాలు విలవిల

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిణామాలతో కీలక రంగాలు విలవిలలాడాయి. ఏప్రిల్‌లో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల ఉత్పత్తి -38.1% మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు 5.2% కాగా.. ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి -9% క్షీణించింది. ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తి -15.5% క్షీణించగా.. ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల ఉత్పత్తి వరుసగా -6.4%, -19.9%, -24.2%, -4.5% మేర పడిపోయింది. ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి వరుసగా -83.9%, -86%, -22.8% చొప్పున క్షీణించింది.

ఇదీ చూడండి:జీఎస్టీ పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేదా?

Last Updated : May 30, 2020, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details