తెలంగాణ

telangana

భారత‌ వృద్ధి రేటు - 3.2 శాతం!

By

Published : Jun 9, 2020, 6:52 AM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు -3.2శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కరోనా వైరస్​ వల్ల విధించిన లాక్​డౌన్​ ఇందుకు కారణమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయని హెచ్చరించింది.

India's economy to contract by 3.2 per cent in fiscal year 2020/21: World Bank
భారత్‌ వృద్ధి రేటు - 3.2 శాతం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేస్తోంది. ఈ ఏడాది -5.2 శాతం క్షీణించనుందని పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు వివిధ దేశాలు షట్‌డౌన్‌ విధించడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ఒక మహమ్మారి వల్ల 1870 తరవాత వచ్చిన అత్యంత దుర్భర మాంద్యం ఇదేనని ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ తెలిపారు. ఆయా దేశాల పాలకులు మరిన్ని చర్యలు తీసుకుంటేనే, ఆర్థిక పునరుత్తేజం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

వర్థమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రభావం చూపగలిగిన ఆర్థిక సహకారం అందించడం కష్టమేనని, ఈ దేశాల్లో అసంఘటిత రంగంలోనే అధిక ఉపాధి లభించడం ఇందుకు కారణమని విశ్లేషించారు. ఈ దేశాల వృద్ధి సంయుక్తంగా -2.5 శాతంగా నమోదు కావచ్చని, గత 60 ఏళ్లలో ఇలా జరగడం ఇప్పుడేనని వివరించారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు -7 శాతంగా నమోదు కావచ్చని, ఆయా దేశాల్లో గిరాకీ, సరఫరా, వాణిజ్యం, రుణవ్యవస్థలు దెబ్బతినడమే ఇందుకు కారణమని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత, అంతటి అధ్వాన్న స్థితిని ఇప్పుడే చూస్తాయని పేర్కొన్నారు.

తలసరి ఆదాయం 3.6 శాతం తగ్గొచ్చు: ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం 3.6 శాతం మేర తగ్గొచ్చని, ఫలితంగా లక్షల మంది అత్యంత పేదరికంలోకి జారిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు మరింత తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, కమొడిటీల ఎగుమతి, విదేశీ రుణాలపై ఆధారపడిన వ్యవస్థలు కూడా దుర్భరం అవుతాయని అంచనా వేసింది. పాఠశాల విద్య, వైద్యంపై పడే ప్రతికూల ప్రభావం, మానవ వనరుల అభివృద్ధిని దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆర్థిక పునరుత్తేజానికి ప్రపంచం ఐక్యంగా ప్రయత్నించాలని సూచించింది.

ప్రపంచ మాంద్యం ఈ సంవత్సరాలలో..: 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020.

ప్రపంచబ్యాంక్‌ అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు -3.2 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచబ్యాంక్‌ సోమవారం అంచనా వేసింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన సంక్షోభమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పునరుత్తేజం సాకారమవుతుందని ‘గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్‌’ నివేదికలో ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. ‘లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి నెమ్మదించింది. అయితే స్వల్పకాల కార్యకలాపాలు గణనీయంగా క్షీణించాయి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణతకు ఇదే కారణమైంది. దీంతోపాటు ప్రపంచ వృద్ధిరేటు నెమ్మదించడం, ఆర్థిక సంస్థల బ్యాలెన్స్‌షీట్లు బలహీన పడటం కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, రుణరేట్లు తగ్గించడం వంటివి కొంతవరకు ఉపశమనం కల్పిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచేందుకు, ప్రభుత్వబాండ్లను రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోలు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం కూడా ఎక్కువగా వ్యయం చేస్తోంది. వేతన మద్దతు, పేదలకు నగదు బదిలీ, పన్ను వసూళ్ల వాయిదాతో పాటు చిన్న వ్యాపార సంస్థలకు రుణ, ద్రవ్యలభ్యత సహకారం అందిస్తోంది.

ఈసారి భారత్‌ వృద్ధి రేటు - 3.2 శాతం

ABOUT THE AUTHOR

...view details