కరోనా సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్నా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని ఏ మాత్రం చెరపలేకపోయింది. గత ఆరు నెలల్లో కొత్తగా 10 వేల అంకురాలు ప్రారంభమవటమే ఇందుకు ఉదాహరణ. దేశంలో గుర్తింపు పొందిన దాదాపు 50 వేల స్టార్టప్‌లలో 40శాతం కంపెనీలు గత 14 నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం.
కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.3శాతం క్షీణించింది. ఇంకా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అంకుర సంస్థలు వ్యాపారాలు ప్రారంభించి ఉద్యోగ కల్పనకు తోడ్పడుతున్నాయి.
5.5 లక్షల మందికి ఉపాధి..
2020-21లో అంకురాలన్నీ 1,70,000 వేల ఉద్యోగాలను కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కొత్తగా ప్రారంభమైన అంకుర సంస్థలు ఒక్కొక్కటి.. కనీసం 11మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఇప్పటి వరకు గుర్తింపు పొందిన 48,000 అంకురాలు 5,50,000 ఉద్యోగాలను సృష్టించినట్లు వెల్లడైంది.
సంక్షోభంలోనూ అంకురాల వృద్ధి..
అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016లో 'స్టార్టప్ ఇండియా' పథకాన్ని ప్రారంభించారు. సరికొత్త ఆలోచనలతో, వినూత్న అవిష్కరణలతో ఔత్సాహికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. తొలి 10 వేల అంకురాలు నమోదయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టింది. అయితే ఇప్పుడు కేవలం ఆరు నెలల్లోనే 10వేల కొత్త అంకారాలు ప్రారంభమయ్యాయి.
పథకం ప్రారంభమైన తొలి ఏడాది 743 అంకురాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం 16 వేల అంకుర సంస్థలకు గుర్తింపు లభించింది. సంక్షోభం ఉన్నా అంకురాల వృద్ధి తగ్గలేదు అనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.