రాబోయే అయిదేళ్లలో దేశంలో 100 కోట్ల సెల్‌ఫోన్లు, అయిదు కోట్ల ల్యాప్‌టాప్‌లు, మరో అయిదు కోట్ల టీవీలు ఉత్పత్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, సమాచార ప్రసార శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల సీఐఐ సమావేశంలో ప్రకటించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ప్రత్యేకించి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, అంతర్జాల ఆధారిత ఉపకరణాల తయారీలో పురోగతిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. అత్యంత కీలకమైన సెమీకండక్టర్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వినియోగించే డిస్‌ప్లేలు, చిప్‌సెట్లు, ప్రాసెసర్ల వరకు ఎన్నో ఉత్పత్తుల కోసం ఎక్కువగా మనం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇప్పటి వరకు మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ అంటే విదేశాల నుంచి విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ ఒక్కచోటుకు చేర్చి బిగించడమే అనే పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించి ‘ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్ (ఈఎస్‌డీఎమ్)’లో దేశాన్ని ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2019లో జాతీయ ఎలెక్ట్రానిక్స్ విధానాన్ని (ఎన్‌పీఈ) తీసుకొచ్చింది. ఈ రంగంలో అవసరమైన అన్ని ఉత్పత్తులనూ ఇక్కడే తయారుచేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలనేది దీని ముఖ్యోద్దేశం. 2025 నాటికి దేశంలో ఈ తరహా ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల ద్వారా రూ.26 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలని ఎన్‌పీఈలో లక్ష్యంగా నిర్ణయించారు. 2025 నాటికి దాదాపు రూ.13 లక్షల కోట్ల విలువైన 100 కోట్ల ఫోన్లను దేశీయ అవసరాల కోసం తయారు చేయాలని, ఏడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే మరో 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానిదే కాబట్టి ఈ రంగంలో భారీ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటు, ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడం, చిన్న చిన్న ఉత్పత్తి సంస్థలతో కలిసి సమూహాలు ఏర్పాటు చేయడం, ఉత్పత్తికి తగ్గట్లు సరఫరా వ్యవస్థను పటిష్ఠపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందించింది.
భారీ ప్రోత్సాహకాలు..
సాంకేతిక ఉపకరణాల తయారీ రంగంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా రూ.రూ.40,951 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రకటించింది. ఈ పథకం కింద రూ.15 వేల కంటే ఎక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే సంస్థలకు ఒక్కోదానికి గరిష్ఠంగా నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపింది. దేశీయ కంపెనీలకు ఒక్కోదానికి నాలుగేళ్లలో రూ.200 కోట్లు ఇవ్వనుంది. ట్రాన్సిస్టర్లు, కెపాసిటర్లు, సర్క్యూట్ బోర్డులు వంటి నిర్దేశిత ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమలకు ఒక్కోదానికి నాలుగేళ్లలో రూ.100 కోట్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించింది.
స్పెక్స్ పథకం..
ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీ కండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) కింద రానున్న ఎనిమిదేళ్లలో రూ.3,285 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఒప్పందం నాటి నుంచి అయిదేళ్లలో పరిశ్రమను నెలకొల్పినవారికి పరిశ్రమ ఏర్పాటు, యంత్ర సామగ్రి కొనుగోలు, సాంకేతిక వసతుల కల్పన, ఉత్పత్తి పరిశోధన- అభివృద్ధిలో వెచ్చించే ఖర్చులో 25 శాతం వరకు తిరిగి చెల్లించనున్నారు. ఎలెక్ట్రానిక్స్ ఉత్పత్తి సమూహాల పథకం (రెండోదశ) కింద- వీటి తయారీ రంగానికి అవసరమైన మౌలిక అవసరాలు తీర్చే పరిశ్రమలకు ఎనిమిదేళ్లలో రూ.3,762 కోట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ప్రస్తుతం 20 లక్షల మందికి ఉపాధి చూపుతోంది. పీఎల్‌ఐ కింద పెట్టుబడులు పెట్టే పరిశ్రమలతో 2024 వరకు మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, తొమ్మిది లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతున్నారు.