దేశ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధి రేటును నమోదు చేసేందుకు అత్యంత సమీపంలో ఉన్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. తాజాగా విడుదల చేసిన జనవరి బులెటిన్లో ఈ విషయం వెల్లడించింది. ఆర్థిక వ్యసస్థ ప్రస్తుతం 'V' ఆకారపు రికవరీని సాధిస్తున్నట్లు తెలుస్తోందని వివరించింది. ఇందులో 'V' అంటే వ్యాక్సిన్ అని బులిటెన్లో కథనం రాసిన ఆర్బీఐ నిపుణులు చమత్కరించారు.
ఆర్బీఐ బులెటిన్లోని ముఖ్యాంశాలు..
కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. ప్రపంచంలోనే మన దేశానికి అతిపెద్ద టీకా ఉత్పత్తి సామర్థ్యం ఉండడం సహా.. ఇదివరకే పోలియో, మశూచి వంటి వ్యాధులకు భారీ ఎత్తున వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టిన అనుభవం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆర్బీఐ నిపుణులు.
ఇది (టీకా ప్రక్రియ) విజయవంతమైతే.. రిస్క్ స్థాయి తగ్గుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రతా పాత్ర పేర్కొన్నారు. ఆర్బీఐ బులెటిన్లో కథనం రాసినవారిలో ఈయన కూడా ఒకరు.