తెలంగాణ

telangana

ETV Bharat / business

'కరోనాపై పోరులో భారత్​ చర్యలు ప్రశంసనీయం'

2020లో కరోనాపై పోరులో భాగంగా భారత్ తీసుకున్న చర్యలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రశంసించింది. ఈ ఏడాది కూడా ఆర్థిక వృద్ధికి ఊతమందించే చర్యలు చేపట్టాలని, భవిష్యత్​లో మరిన్ని సంస్కరణలతో ముందుకెళ్లాలని సూచించింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపైనా ఐఎంఎఫ్​ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

IMF Chief on India effort to deal with coronavirus
భారత్​పై ఐఎంఎఫ్​ చీఫ్​ ప్రశంసలు

By

Published : Jan 15, 2021, 12:02 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారితోపాటు దానివల్ల ఎదురైన ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్​) ప్రశంసించింది. వేగంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా చేపట్టాలని సూచించింది. కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ప్రముఖంగా ఇదే విషయాన్ని వెల్లడించబోతున్నట్లు వెల్లడించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ను జనవరి 26న విడుదల చేయనున్నామని.. దీన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చారు.

2021పై ఆశాభావం..

అత్యంత రద్దీ, అధిక జనసాంద్రత కలిగిన భారత్‌లో‌ సుదీర్ఘ కాలం పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన తీరును ఐఎంఎఫ్‌ చీఫ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్‌ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పనిచేసినట్లు అభిప్రాయపడ్డారు. అయితే, ఆర్థికవ్యవస్థను మరింత ముందుకు నడిపించడం కోసం 2021 ఏడాదిని భారత్‌ మరింత వినియోగించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా భారత్‌ చేపడుతోన్న నిర్మాణాత్మక సంస్కరణలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంస్కరణలతో మరింత ముందుకు వెళ్లాలని ఐఎంఎఫ్‌ చీఫ్‌ భారత్‌కు సూచించారు.

సాగు చట్టాలు ఓ ముందడుగు..

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు వ్యవసాయ సంస్కరణల్లో ఓ ముందడుగని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభిప్రాయపడింది. వీటివల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా పంటను విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపింది. అయినప్పటికీ, ఈ నూతన విధాన మార్పుల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజిక భద్రతను కల్పించాల్సిన అవసరముందని ఐఎంఎఫ్‌ స్పష్టంచేసింది.

ఇదీ చూడండి:అమెరికా బ్లాక్​లిస్ట్​లో షియోమీ సహా 9 చైనా కంపెనీలు

ABOUT THE AUTHOR

...view details