2020లో భారత్‌కు 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు ఐక్య రాజ్య సమితి (ఐరాస) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఎఫ్‌డీఐలను రాబట్టుకున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. 2019తో వచ్చిన 51 బిలియన్ డాలర్ల ఎఫ్డీఎలతో పోలిస్తే ఈ మొత్తం 27 శాతం ఎక్కువని పేర్కొంది. దక్షిణాసియా మొత్తానికి 71 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. అందులో అత్యధిక భాగం భారత్‌వేనని.. 'యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్(యూఎన్‌సీటీఏడీ)' పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో చైనా 149 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను రాబట్టుకున్నట్లు తెలిపింది.
ఐసీటీ పరిశ్రమ జోరు..
దేశంలో కరోనా సంక్షోభం కారణంగా.. ఆర్థిక కార్యకలాపాలపై పెను భారం పడిందని వివరించింది నివేదిక. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు, సేవలకు డిమాండ్ పెరగడం వల్ల ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పరిశ్రమలో కొనుగోళ్లు పెరిగాయని వెల్లడించింది. భారత్‌కు ఎఫ్‌డీఐల వృద్ధి దీర్ఘకాలికంగా ఉంటుందని.. ఐసీటీ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతూనే ఉంటాయని నివేదిక అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐల డీలా..
భారత్, చైనా వంటి దేశాలకు ఎఫ్‌డీఐలు పెరిగినప్పటికీ.. ప్రపంచం మొత్తం మీద వీటి ప్రవాహం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. 2019(1.5 ట్రిలియన్ డాలర్లు)తో పోలిస్తే 2020లో ఎఫ్‌డీఐల మొత్తం 35 శాతం తగ్గి ట్రిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వివరించింది.