దేశంలో మేడ్ ఇన్ చైనా వస్తువులపై అయిష్టత పెరిగినా.. చైనా, కొరియా మార్కెట్‌ను భారత్ అందుకునేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు ప్రముఖ ఆర్థికవేత్త ఎన్ఆర్. భానుమూర్తి. భారతీయుల్లో చాలా మంది చైనా వస్తువుల కొనుగోలును తగ్గించినట్లు 'లోకల్ సర్కిల్' అనే సంస్థ వెల్లడించిన సర్వే గణాంకాలపై స్పందించారు. 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలోఈ వివరాలు తెలిపారు.
ఆత్మ నిర్భర్ భారత్‌కే ఈ క్రెడిట్..
ఈ క్రెడిట్‌ను 'ఆత్మ నిర్భర్ భారత్'కు ఇచ్చారు భానుమూర్తి. కరోనా లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ నినాదాన్ని తీసుకొచ్చారు. చైనా ఉత్పత్తులపై ఆధారపడకుండా.. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వడమే దీని ముఖ్య ఉద్దేశం.
గల్వాన్ ఘటన తర్వాత చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే విధంగా గత ఏడాది జూన్‌లో 59, సెప్టెంబర్‌లో 118 చైనా యాప్‌లను నిషేధించింది కేంద్రం.
ఎన్ఆర్ భానుమూర్, ఆర్థిక వేత్త ఇంకా చాలా చేయాలి..
'ఈ విశ్లేషణలోకి ఆర్‌సెప్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి చైనా ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత్ దీనిపై సంతకం చేయలేదు. ఏదేమైనా అంతర్జాతీయ వాణిజ్యంలో భాగస్వామ్యంగా ఉండాలనే భారత్ ఆర్సెప్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ గట్టి పోటీ ఇచ్చేందుకు ఇంకా చాలా చేయాల్సి ఉంది' అని చెప్పారు భానుమూర్తి.
సేవా రంగంలో ఓకే కానీ..
'చైనా సహా ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ పోటీ దేశంగా ఉండగలదనండంలో నాకు సందేహం లేదు. అయితే ఇందుకు సరైన చర్యలు అవసరం. ఉదాహరణకు సేవా రంగంలో చైనాతో పోలిస్తే.. భారత్ పోటీగా ఉంది. తయారీ రంగ విషయానికొస్తే.. చైనాకు సమీపంలో కూడా మనం లేము. అయితే కార్మిక సంస్కరణలకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందులో కొన్ని భూ సంస్కరణలు కూడా ఉన్నాయి. దేశ తయారీ రంగాన్ని మరింత పోటీతత్వంగా మార్చేందుకు విధానపరమైన జోక్యం కూడా అవసరం' అని అభిప్రాయపడ్డారు.
అయితే ఇలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు భానుమూర్తి. దిగుమతులపై సుంకాల పెంపు వంటి చర్యలు సరైనని కావని పేర్కొన్నారు. ఇవి దీర్ఘకాలంలో మేలు చేసే అంశాలు కావని వివరించారు.
లోకల్ సర్కిల్ సర్వేలో తేలిన విషయాలు..
గత ఏడాది జరిగిన గల్వాన్ ఘటన తర్వాత 12నెలల్లో 43శాతం మంది భారతీయులు చైనాలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయలేదని సర్వే వివరించింది.
'చైనాతో గల్వాన్ లోయలో ఘర్షణ(Galwan valley clash) తర్వాత భారతీయ వినియోగదారుల తీరులో మార్పు వస్తోంది. చాలా మంది చైనా తయారీ వస్తువులకు(China products in India) ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో చైనా వస్తువులు విరివిగా కొనుగోలు చేసిన వారు కూడా ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు' అని పేర్కొంది.
అయిష్టతకు కారణమదే..
గత నవంబర్‌లో పండగ సీజన్‌లో 71శాతం మంది ప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేయలేదని సర్వే వెల్లడించింది. ధర తక్కువగా ఉండటం, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కొనుగోలు చేసినట్లు మిగిలిన వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 281 జిల్లాల్లో 18,000 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. 2020లో లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణలు.. చైనా వస్తువులపై అయిష్టతను పెంచినట్లు సర్వే వెల్లడించింది.
ఇవీ చదవండి: