దేశ చరిత్రలోనే తొలిసారిగా భారత్ ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టబోతోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు క్షీణించిందని.. దానర్థం భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని ఆర్‌బీఐలోని నిపుణులు అభిప్రాయపడ్డారు.
నౌకాస్ట్ విధానం తొలి అంచనాలు..
కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. అయితే జులై-సెప్టెంబరు త్రైమాసికంలోనూ వృద్ధిరేటు 8.6శాతం క్షీణించే అవకాశాలున్నట్లు ఆర్‌బీఐ నౌకాస్ట్ విధానంలో తొలిసారి విడుదల చేసిన అంచనాల్లో నిపుణులు ఈ మేరకు అభిప్రాయపడ్డారు. దీనితో భారత్ సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని మానిటరీ పాలసీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పంకజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘వరుసగా రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు క్షీణించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనితో చరిత్రలో తొలిసారిగా భారత్ సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టింది’ అని ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ పేరుతో రాసిన ఆర్టికల్‌లో పంకజ్ కుమార్ వెల్లడించారు. అయితే దశలవారీగా కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తే క్షీణతను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడం వల్ల మే, జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుందని ఆర్టికల్‌లో పేర్కొన్నారు.