కరోనా లాక్డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. భారత్లో స్వాతంత్ర్యం అనంతరం (ప్రస్తుతంతో కలిపి) నాలుగు సార్లు మాంద్యం వచ్చిందని.. వాటన్నింటిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలిపింది.
లాక్డౌన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశార్థికం 5 శాతం మేర క్షీణించే ప్రమాదముందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ రేటు 25 శాతం తగ్గొచ్చని పేర్కొంది.
వాస్తవికంగా జీడీపీలో 10 శాతం శాశ్వతంగా కోల్పోయిన కారణంగా.. వృద్ధి రేటుపై ఇంతకుముందు పెట్టుకున్న అంచనాలను చేరుకోవడం అసాధ్యమని పేర్కొంది.
ఈ సారి మాంద్యం భిన్నం..
గడిచిన 69 ఏళ్లలో భారత్ 3 సార్లు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 1958,1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం ఈ మూడు సార్లు ఒకే విధంగా ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది.