తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక వృద్ధిలో పుంజుకున్న భారత్​ - india gdp growth q3 2020

భారత ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మిన్నగా పుంజుకుంది. తయారీ రంగం పుంజుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.5 శాతం మాత్రమే క్షీణించింది. వినియోగదారుల గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో వృద్ధి మరింత మెరుగువుతుందన్న ఆశలకు ఈ గణాంకాలు ప్రాణం పోశాయి.

Indian gdp
భారత ఆర్థిక వ్యవస్థ

By

Published : Nov 28, 2020, 6:49 AM IST

2020-21 తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో భారత జీడీపీ రికార్డు స్థాయిలో 23.9 శాతం మేర క్షీణించింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ల సడలింపుతో జులై నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20 జులై-సెప్టెంబరులో జీడీపీ 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ క్షీణిస్తుందని అంచనా వేసిన విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు.. సెప్టెంబరు త్రైమాసికంలోనూ భారీ క్షీణతను అంచనా వేశారు.

వ్యవ'సాయం' కొనసాగింది

తయారీ రంగం ఆశ్చర్యకర రీతిలో జులై-సెప్టెంబరులో 0.6 శాతం వృద్ధి నమోదు చేసింది. జూన్‌ త్రైమాసికంలో ఈ రంగం ఏకంగా (-)39 శాతం కుదేలైంది. ఇక వ్యవసాయ రంగం తన వృద్ధిని కొనసాగిస్తూ 3.4 శాతం పెరిగింది. వాణిజ్య, సేవల రంగం అంచనాల కంటే తక్కువగా (-)15.6 శాతం డీలా పడింది. ఆర్థిక, స్థిరాస్తి సేవలు 8.1%, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌ 15.6%; నిర్మాణ రంగం 8.6 శాతం చొప్పున క్షీణించాయి. ప్రజల వ్యయం (-)12 శాతం తగ్గింది.

సాంకేతిక మాంద్యంలోకి అడుగుపెట్టాం.. కానీ, జులై-సెప్టెంబరులోనూ వృద్దిరేటు క్షీణించిన నేపథ్యంలో సాంకేతికతంగా భారత్‌ తొలిసారిగా మాంద్యంలోకి అడుగుపెట్టినట్లయింది. (ఏదైనా ఒక దేశం వరుస రెండు త్రైమాసికాల్లో జీడీపీలో క్షీణత నమోదు చేస్తే మాంద్యంలోకి వెళ్లినట్లు చెబుతారు.) అయితే ఈ ఆర్థిక సంవత్సరంలోపే వృద్ధి తిరిగి సానుకూలంలోకి అడుగుపెడుతుందన్న ఆశలకు ప్రస్తుత గణాంకాలే నిదర్శనం. లాక్‌డౌన్‌ తదుపరి దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మిన్నగా, బలంగా పుంజుకుంటోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం పేర్కొనడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సానుకూల వృద్ధి నమోదవవచ్చనీ ఆయన అంచనా వేశారు.

కొసమెరుపు: వచ్చే వారం ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ముందు జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.

ఈ ఏడాది జులై-సెప్టెంబరులో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్‌-జూన్‌ 2020లో నమోదైన 3.2 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.

ఎవరెవరు ఏమన్నారంటే..

కరోనా పరిణామాలు, జూన్‌ త్రైమాసిక పనితీరు నేపథ్యంలో ఇవి ప్రోత్సాహకర గణాంకాలు. అయితే పరిస్థితులు ఆశావహంగా ఉన్నా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్త తప్పనిసరి.

- కృష్ణమూర్తి సుబ్రమణియన్‌, ముఖ్య ఆర్థిక సలహాదారు

రెండో త్రైమాసిక గణాంకాలు ఆర్థిక రికవరీని ధ్రువీకరిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దీపన, సంస్కరణలపై చేపట్టిన చర్యలు ఫలితాలను కనబరుస్తున్నాయి. 2020-21 ద్వితీయార్థంలో సానుకూల వృద్ధిని; 2021-22లో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తామని ఆశిస్తున్నా.

- అనిల్‌ అగర్వాల్‌, ఛైర్మన్‌, వేదాంతా

ఈ ఆర్థిక రికవరీ ఆనందాన్నిచ్చింది. తయారీ గణాంకాలు సానుకూల వృద్ధిని నమోదు చేయడం చూస్తుంటే గిరాకీ ఆధారిత రికవరీ పుంజుకుంటోందని అర్థమవుతోంది.

- రాజీవ్‌ కుమార్‌, నీతి ఆయోగ్‌, వైస్‌ ఛైర్మన్‌

పెరిగిన ద్రవ్యలోటు

కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు మరింత పెరిగి రూ.9.53 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు చివరి నాటికి నమోదైన ఈ మొత్తం వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో దాదాపు 120 శాతానికి సమానం కావడం గమనార్హం. కరోనా కారణంగా వ్యాపార కార్యకలాపాలు మందగమనం పాలు కావడంతో ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. సెప్టెంబరు 2020 చివరకు ద్రవ్యలోటు వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో 114.8 శాతంగా ఉంది. వ్యయాలు, ఆదాయానికి మధ్య ఉన్న అంతరాన్ని ద్రవ్యలోటుగా పిలుస్తారు.

అక్టోబరు వరకు ప్రభుత్వానికి రూ.7,08,300 కోట్ల ఆదాయాలు లభించాయి. ఇవి 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో 31.54 శాతానికి మాత్రమే సమానం. కాగా, మొత్తం వ్యయాలు బడ్జెట్‌ అంచనాల్లో 54.61 శాతానికి సమానమైన రూ.16,61,454 కోట్లుగా నిలిచాయి. దీంతో ద్రవ్యలోటు రూ.9,53,154 కోట్లుగా నిలిచింది. 2019-20లో ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 4.6 శాతానికి చేరింది.

ఇదీ చూడండి:రూ.15 లక్షల కోట్ల మేర జీడీపికి ముప్పు!

ABOUT THE AUTHOR

...view details