కొవిడ్-19 మహమ్మారి తరవాత జీవిత, ఆరోగ్య బీమాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పాలసీలు తీసుకునేందుకు గతంలో వెనకాడిన వారూ.. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీటిని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.. వస్తున్నారు. ఇప్పటికే క్లెయింలు పెరగడం, భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం లాంటి కారణాలతో ఏప్రిల్ 1 నుంచి టర్మ్ పాలసీల ప్రీమియం పెంచేందుకు బీమా సంస్థలు సిద్ధం అవుతున్నాయి. కొత్తగా తీసుకోబోయే పాలసీలకు దాదాపు 15-20 శాతం వరకు అధిక ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు.
గత ఏడాది కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా.. దీని బారినపడిన వారి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారికీ, కొవిడ్ కారణంగా ఇతర జబ్బులు సోకాయి. సాధారణంగా టర్మ్ పాలసీల ప్రీమియాన్ని నిర్ణయించేందుకు బీమా సంస్థలు మరణ రేటు (మోర్టాలిటీ రేట్)ను ఆధారంగా తీసుకుంటాయి. గత ఏడాది కాలంలో పాలసీదారులు అనేక మంది మరణించడం వల్ల బీమా సంస్థలు అధిక క్లెయింలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో బీమా సంస్థలు ప్రీమియాన్ని పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.
రెండేళ్లలో 40 శాతం అధికం
ప్రైవేటు బీమా సంస్థలు ఏడాది క్రితం టర్మ్ పాలసీల ప్రీమియాన్ని దాదాపు 25-30 శాతం వరకు పెంచాయి. అయినప్పటికీ.. క్లెయింల రేటు పెరగడం కారణంగా ప్రస్తుత ప్రీమియం రేట్లు సరిపోవడం లేదని వాటి వాదన. ఈసారి పెంపు 15-20 శాతం వరకు ఉంటోంది. అంటే, గత రెండేళ్ల కాలంలో టర్మ్ పాలసీల ప్రీమియం దాదాపు 40శాతం అధికం అయినట్లు లెక్క. పూర్తి రక్షణకే పరిమితమయ్యే ఈ పాలసీలపై ప్రజలకు అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ప్రీమియం పెంచడం వల్ల.. చాలామంది సరైన బీమా రక్షణకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుందని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు పెంచిన ప్రీమియాన్ని అమలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఏప్రిల్ 1 నుంచి పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.
పోటీ పెరగడం వల్ల..
నిజానికి బీమాకు అసలైన నిర్వచనం టర్మ్ పాలసీలే. తక్కువ ప్రీమియానికి.. అధిక బీమా రక్షణ ఇవ్వడం వీటి ప్రత్యేకత. ఆర్జించే వ్యక్తి తన వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకు జీవిత బీమా తీసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున బీమా రక్షణ కావాలంటే అది టర్మ్ పాలసీల వల్లే సాధ్యం. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే పరిహారం వస్తుంది. లేకపోతే చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. పెట్టిన డబ్బులు వృథాగా పోతాయనే భావనతో కొంతకాలం వరకు వీటికి పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ, బీమా సంస్థలు పోటీలు పడి.. ప్రీమియం రేట్లను తగ్గించడం సహా వీటిలో వివిధ రకాల వినూత్న పాలసీలను ఆవిష్కరించడం ప్రారంభించాయి. అప్పుడు ప్రీమియం రాయితీ ఇవ్వడంలో పోటీపడిన సంస్థలే.. ఇప్పుడు ప్రీమియాన్ని పెంచేందుకు ముందుకు వస్తున్నాయి. మోర్టాలిటీ టేబుల్, కంపెనీ నష్టభయం ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి.. అందులో ఎంత మేరకు పాలసీదారులకు ఆ భారాన్ని బదిలీ చేయొచ్చు అనేదే దీనికి ఆధారం అవుతుంది.
ప్రీమియం పెరిగేందుకు అసలు కారణం..