తెలంగాణ

telangana

ETV Bharat / business

కోలుకుంటున్న ఎగుమతులపై కరోనా 2.0 సెగ!

కరోనా వైరస్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలు ఎగమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు ఇంజనీరింగ్ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ (ఈఈపీసీ) తెలిపింది. గత ఏడాది రికార్డు స్థాయిలో పతనమైన ఎగుమతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. మళ్లీ ఆంక్షలతో అనిశ్చితి నెలకొంటున్నట్లు వెల్లడించింది.

India exports
భారత ఎగుమతులు

By

Published : Apr 25, 2021, 4:43 PM IST

కరోనా వైరస్​ రెండో దశ దేశాన్ని కుదిపేస్తున్న వేళ రాష్ట్రాలు స్థానికంగా కర్ఫ్యూ, మినీ లాక్​డౌన్ల వంటి ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతికి ఆటంకంగా మారనున్నట్లు.. ఇంజనీరింగ్ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ (ఈఈపీసీ) పేర్కొంది. దీని వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్​ఎంఈ) కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపింది.

'గత కొన్ని నెలలుగా సాధించిన రికవరీ వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతులపై సరికొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల అనిశ్చితి నెలకొంటోంది. వేగంగా టీకాలు వేయడమే ఇందుకు సరైన పరిష్కారం' అని ఈఈపీసీ అభిప్రాయపడింది.

అమెరికాకు అత్యధిక ఎగుమతులు..

ప్రపంచవ్యాప్త డిమాండ్, పెరిగిన ఆర్థిక కార్యకలాపాల నేపథ్యంలో మార్చిలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు సానుకూలంగా నమోదైనట్లు తెలిపింది ఈఈపీసీ. ఐరన్​, ఇండస్ట్రీయల్ మిషనరీ, ఆఫిస్​ ఎక్విప్​మెంట్ సహా మొత్తం 33 రకాల్లో 32 ఉత్పత్తులు భారీగా ఎగుమతైనట్లు వెల్లడించింది.

ఇందులో అమెరికాకు అత్యధికంగా 1,152.80 మిలియన్​ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు పేర్కొంది ఈఈపీసీ. చైనాకు 553.06 మిలియన్ల విలువైన ఎగుమతులు చేసినట్లు వివరించింది. మూడో స్థానంలో యూఏఈ ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:ఆక్సిజన్ సరఫరాలో 'ఉక్కు' సంకల్పం

ABOUT THE AUTHOR

...view details