గృహ రుణ వడ్డీ రేట్లు ప్రస్తుతం 7 శాతం వద్ద ఉన్నందున.. ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయమని చాలా మంది భావిస్తున్నారు. బిల్డర్ల వద్ద ఇప్పటికే నిర్మాణం పూర్తైన ఇళ్లు ఎక్కువగానే ఉన్న కారణంగా.. కొనుగోలుదారులకు అవకాశాలూ ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇల్లు కొనుగోలు చేసే ముందు రుణం తీసుకునే సంస్థ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలు
గృహ రుణం తీసుకునే క్రమంలో తక్కువ వడ్డీ రేట్లు ఉన్న సంస్థలను ఎంచుకోవటం సహజమైన విషయమే. వడ్డీ రేటు కొంచెం మారినా దీర్ఘకాలంలో చెల్లించే మొత్తం భారీగా ఉంటుంది. అయితే వడ్డీ రేట్లను మాత్రమే సరిపోల్చుకోవటం.. ఎంపికకు పూర్తి ఆధారం కాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజులు, టెక్నికల్ అసెస్మెంట్, డాక్యుమెంటేషన్ ఫీజులు తదితరాల రూపంలో బ్యాంకులు ఇతర ఛార్జీలను విధిస్తాయి. గడువు కంటే ముందే రుణాన్ని చెల్లించాలంటే ప్రీపేమెంట్ ఛార్జీలు.. మీరు తీసుకునే మొత్తంలో 0.25 శాతం నుంచి 2 శాతం వరకు అవకాశం ఉంటుంది. వీటి వల్ల భారం ఎక్కువవుతుంది. ఈ ఛార్జీలకు మినహాయింపు ఇచ్చే బ్యాంకుల్లో రుణం తీసుకోవడం ఉత్తమమని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మంచి క్రెడిట్ స్కోరు ఉంటే..
రుణం ఇవ్వాలా లేదా అన్నదానికి ప్రధాన ఆధారం క్రెడిట్ స్కోరు. అదే విధంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేట్లు తగ్గించటం లేదా ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. దీనివల్ల రుణ భారం తగ్గుతుంది.
విశ్వసనీయత
మార్కెట్లో బ్యాంకు లేదా ఫినాన్స్ సంస్థకు ఉన్న విశ్వసనీయత అనేది గృహ రుణం ఎంచుకునే ముందు గమనించాలి. డెవలపర్ దగ్గర ఏదైనా సమస్య వచ్చినట్లయితే కొనుగోలుదారుడు నష్టపోతాడు. ఇదే విషయం రుణం ఇచ్చిన ఫినాన్స్ సంస్థ లేదా బ్యాంకుకు కూడా వర్తిస్తుంది. ఏదైనా సమస్య వల్ల బ్యాంకు లేదా ఫినాన్స్ సంస్థ చిక్కుల్లో చిక్కుకుంటే మీపై ప్రభావం ఉంటుంది. అందుకే విశ్వసనీయత ఉన్న సంస్థల వద్దే రుణం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
సేవలపై స్పష్టత..
గృహ రుణం అనేది దీర్ఘకాలంతో కూడుకున్న విషయం. రుణం తీసుకున్నాక.. చాలా ఏళ్లపాటు ఆ సంస్థతో పని ఉంటుంది. ఉదాహరణకు పన్ను మినహాయింపు తీసుకునేందుకు ప్రతి సంవత్సరం వడ్డీ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు డిజిటల్‌గా ఈ సేవలను అందిస్తుండగా.. మరికొన్ని భౌతికంగా ఈ సేవలందిస్తున్నాయి. కాబట్టి రుణం తీసుకున్న అనంతరం రుణం ఇచ్చే సంస్థ సేవల గురించి తెలుసుకోవాలి.
షరతులతో జాగ్రత్త..
ఈ రోజుల్లో చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తొందరగా రుణం ఇచ్చేందుకు డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాయి. వారం లోపే రుణం మొత్తం ఖాతాలో జమకూడా అవుతోంది. అయితే ఇలా దరఖాస్తు చేసుకునే సమయంలో నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. అదనపు ఛార్జీలు, పేమెంట్ ఆలస్యం అయినప్పుడు విధించే జరిమానాలకు సంబంధించి సంస్థతో ముందుగానే చర్చించాలి.
చర్చల ద్వారా ప్రయోజనం..
రుణం తీసుకునే ముందు వడ్డీ, ఇతర నిబంధనలకు సంబంధించి బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీతో చర్చించటం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ చర్చల సమయంలో రుణాలకు డిమాండ్ తక్కువ ఉండి, ఫినాన్సియల్ సంస్థలు రుణాలిచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లయితే.. అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ స్కోరునూ ఈ చర్చల సమయంలో ఉపయోగించుకోవచ్చు.
ఇదీ చదవండి:'పీఎస్‌యూల ప్రైవేటీకరణతో భారీగా ఉద్యోగాలు!'