తెలంగాణ

telangana

ETV Bharat / business

జీడీపీ క్షీణత భారత్​లోనే అత్యధికం! - భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

జీ-20 దేశాల్లో అత్యధికంగా వృద్ధి రేటు పతనమైన దేశంగా భారత్ నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. ఈ లెక్కల ప్రకారం 2020 ఏప్రిల్-జూన్​ కాలంలో భారత జీడీపీ -25.6 శాతం క్షీణించింది.

IMF’s chief economist Gita Gopinath on Indian Econom
భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన

By

Published : Sep 3, 2020, 2:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో(జీ-20 దేశాల్లో) భారత జీడీపీ.. ఈ ఏడాది జూన్​తో ముగిసిన త్రైమాసికంలో అత్యధిక క్షీణతను నమోదు చేసినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) వెల్లడించింది.

జీ-20 దేశాలకు సంబంధించి ఐఎం​ఎఫ్​ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ట్విట్టర్​​లో ఓ గ్రాఫ్​ను షేర్ చేశారు. ఇందులో భారత్ ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో(ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే).. 25.6 శాతం ప్రతికూల వృద్ధి రేటుతో చివరి స్థానంలో ఉంది.

భారత్​ తర్వాత అత్యధికంగా జీడీపీ పతనమైన దేశాల్లో బ్రిటన్ రెండో స్థానంలో నిలిచింది. బ్రిటన్​ వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ మధ్య -20.4 శాతంగా నమోదైనట్లు తెలిసింది.

చైనా సానుకూల వృద్ధి..

చైనా జీడీపీ మాత్రం ఏప్రిల్-జూన్ మధ్య 12.3 శాతం పెరిగింది. ఇదే సంవత్సరం క్యూ1లో చైనా వృద్ధి రేటు రికార్డు స్థాయిలో పతనమైన విషయం తెలిసిందే. ఈ గ్రాఫ్​లో సానుకూల వృద్ధి నమోదు చేసిన దేశం కూడా చైనా ఒక్కటే కావడం గమనార్హం.

ఏడాదంతా ప్రతికూలమే..

అగ్రరాజ్యం అమెరికా 2020 రెండో త్రైమాసింకలో -9.1 శాతం, ఐరోపా సమాఖ్య (ఈయూ) -11.7 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఈ స్థాయిలో వృద్ధి రేట్లు పతనమైనట్లు గీతా గోపినాథ్ పేర్కొన్నారు. 2020 మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు కాస్త పుంజుకున్నా.. పూర్తి సంవత్సరంలో మాత్రం భారీ క్షీణతే ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దేశీయ గణాంకాలు..

ఈ వారమే కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన ఆర్థిక గణాంకాల ప్రకారం.. భారత జీడీపీ 2020-21 రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 23.9 ప్రతికూల వృద్ధిని నమోదు చేసినట్లు తేలింది. ఈ త్రైమాసికంలో చాలా వరకు లాక్​డౌన్ ఉన్న కారణంగా భారీ స్థాయిలో వృద్ధి పతనమైనట్లు కేంద్రం పేర్కొంది.

దీనిపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాశ్ చంద్రగార్గ్ స్పందిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఇంకా తగ్గలేదని పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ 12-15 శాతం క్షీణత నమోదవ్వచ్చని అంచనా వేశారు.

ఇదీ చూడండి:కరోనాతో పేదరికంలోకి 4.7 కోట్ల మంది మహిళలు!

ABOUT THE AUTHOR

...view details