2020లో భారత ఆర్థిక వ్యవస్థ 4.5శాతం మేర తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనా వేసింది. భారత్కు సంబంధించి చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి ఇదేనని ఐఎంఎఫ్ పేర్కొంది. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది.
అయితే 2021లో భారత ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
"భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.5శాతం మేర తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాల లాక్డౌన్ సహా ఏప్రిల్లో ఆశించిన స్థాయిలో రికవరీ నమోదుకాకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది."
-ఐఎంఎఫ్
అంతటా ఇంతే
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై కరోనా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం మేర కుచించుకుపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఏప్రిల్లో(3 శాతం తగ్గుదల) అంచనా వేసిన దానికంటే ప్రభావం మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కనిష్ఠానికి దిగజారడం ఇదే ప్రథమమని ఐఎంఎఫ్ తెలిపింది. అటు.. అమెరికా జీడీపీ 8శాతం తగ్గుతుందని అంచనా వేసింది ఐఎంఎఫ్.
ఆలస్యంగానే రికవరీ
ముందస్తు అంచనాలతో పోలిస్తే 2020 ప్రథమార్థంలో కరోనా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని కనబర్చిందని ఐఎంఎఫ్ పేర్కొంది. రికవరీ ఆలస్యంగానే జరిగే అవకాశం ఉందని తెలిపింది.
2020లో అన్ని ప్రాంతాలూ దాదాపు ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తాయని వెల్లడించింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై వైరస్ కోలుకోలేని ప్రభావం చూపినట్లు తెలిపింది. దీని వల్ల 1990 నుంచి పేదరికంపై సాధించిన గణనీయమైన పురోగతిని దెబ్బతిందని పేర్కొంది.
చైనాలో సానుకూలం
ఈ సంక్షోభం నుంచి చైనా కోలుకుంటున్నట్లు తెలిపింది. తొలి త్రైమాసికంలో ఈ ఫలితాలు కనిపించినట్లు స్పష్టం చేసింది. ఆ దేశం తీసుకున్న ఉద్దీపనల కారణంగా వృద్ధి ఒక శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తలసరి ఆదాయం డీలా
95 శాతానికి పైగా దేశాల తలసరి ఆదాయం ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేశారు ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు -8 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు -3 శాతం (చైనాను మినహాయిస్తే -5 శాతం) మేర తిరోగమన బాట పడతాయని పేర్కొన్నారు.
కరోనా కారణంగా చాలా దేశాలు లాక్డౌన్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని.. దాని వల్ల వైరస్ కట్టడి జరిగినా.. మహా ఆర్థిక మాంద్యం తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసిన దేశాల్లో మళ్లీ వైరస్ ప్రబలుతోందని అన్నారు.
ఇదీ చదవండి-ఇకపై తెలుగులోనూ ఫ్లిప్కార్ట్ షాపింగ్