రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో ఐటీ పరిశ్రమ.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి.. ఒక అద్భుతమైన అవకాశంగా మారిందో అలాంటి పరిస్థితి ఈరోజు ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో నెలకొని ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేవలం కరోనా సంక్షోభంలో మాత్రమే కాకుండా సంక్షోభం తర్వాత ఫార్మా, లైఫ్ సైన్సు రంగంలో అనేక అవకాశాలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుందని మంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో మంత్రి పాల్గొన్నారు.
30 శాతం వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచే..
ఐటీ రంగంలోని టాప్ ఫైవ్ కంపెనీలు ఏవిధంగా అయితే తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయో అదేవిధంగా నోవార్టిస్ లాంటి ఫార్మా దిగ్గజాలూ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకి గర్వకారణమని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ లాంటి కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.