గతేడాది కన్నా ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం శుక్రవారం నెలవారీ ఆర్థిక పరిస్థితుల నివేదిక విడుదల చేసింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఆగస్టు నాటికి కేంద్రం రుణాలు 1.72 రెట్లు, రాష్ట్రాల అప్పులు 58.7% మేర పెరిగాయి.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వడ్డీలు, ప్రధాన సబ్సిడీల కోసం చేసిన ఖర్చులు 33.7% మేర ఎగబాకాయి. జులై నాటికి ఆర్థిక లోటు రూ.8.2 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఆర్థికలోటు బడ్జెట్ అంచనాల్లో 77.8% మేర ఉండగా, ఈసారి అది 103.1%కి పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఆదాయ వసూళ్లు పడిపోయాయి.
నికర ఆదాయ వసూళ్లు..
నిరుడు ఇదే సమయానికి నికర ఆదాయ వసూళ్లు 20.5% మేర ఉండగా, ఇప్పుడు అవి 12.4%కి తగ్గిపోయాయి. వ్యక్తిగత ఆదాయపన్ను గతేడాది రూ.1.29 లక్షల కోట్ల మేర వసూలుకాగా, ఈసారి అది రూ.91 వేల కోట్లకే పరిమితమైంది. రుణేతర మూలధన(నాన్‌డెట్ క్యాపిటల్) వసూళ్లు ఇప్పటివరకు కేవలం రూ.5,458 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అవి 14.2% వసూలుకాగా ఇప్పుడు 2.4%కి పడిపోయాయి.