పెట్రోల్, డీజిల్ ధరల (Fuel Prices) మంటతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల కోసం చూస్తున్నారు. విద్యుత్, సీఎన్జీ వాహనాలకు మారటం ఖర్చుతో కూడుకున్న పని కావడం వల్ల.. చాలా మంది ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఒకటి క్రెడిట్ కార్డులను (Fuel card) ఉపయోగించటం.
క్రెడిట్ కార్డులను వాడటం ద్వారా ఇంధన ధరల భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రోజువారీగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి.
బ్యాంకులు వివిధ ఆయిల్ కంపెనీలతో కలిపి కో బ్రాండెడ్ కార్డులను (Co branded credit card) అందిస్తుంటాయి. ఈ కార్డులతో ఆయా కంపెనీల బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే ఎక్కువ రివార్డు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐ బీపీసీఎల్ కార్డు తీసుకుంటే 4.25 శాతం వాల్యూ బ్యాక్ వస్తుంది. దీన్ని రివార్డ్ పాయింట్ల రూపంలో పొందవచ్చు.
ఛార్జీల గురించి తెలుసుకోండి..
అయితే ఈ కార్డులను తీసుకోవటం వల్ల భరించాల్సిన ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. జాయినింగ్ ఫీజులు, వార్షిక ఛార్జీల వంటవి ఈ కోవలోకే వస్తాయి. వీటిని రివార్డులతో పోల్చి చూసుకోవాలి. కొన్ని కార్డులు తక్కువ రివార్డులు ఇస్తూ ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవచ్చు.
వార్షిక ఫీజులు కార్డును బట్టి మారుతుంటాయి. కొన్ని కార్డులపై ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఒక నిర్ణీత పరిమితి మించి కార్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కార్డును ఉచితంగానే ఉపయోగించుకునే వీలు ఉంటుంది.
కార్డును ఉపయోగించినప్పుడు కనీస ఖర్చు(మినిమం స్పెండింగ్) గురించి తెలుసుకోవాలి. కనీస మొత్తం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. దీనికి అనుగుణంగా పెట్రోలు ఫిల్లింగ్ ప్రణాళిక చేసుకోవాలి. అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఫిల్లింగ్ చేయించుకునే బదులు.. ఆ పరిమితి ఎక్కువున్నట్లయితే ఆ మేర తక్కువ సార్లు పెట్రోల్ పోయించుకోవడం ఉత్తమం.