తెలంగాణ

telangana

ETV Bharat / business

మారటోరియం, వాయిదాల భారం తగ్గాలంటే!

కరోనా నేపథ్యంలో రుణగ్రహీతలకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించేలా ఈఎంఐలపై ఆర్​బీఐ విధించిన మారటోరియం గడువు ఆగస్టుతో ముగిసింది. ఈ ఆరు నెలలు మారటోరియాన్ని వాడుకున్న రుణగ్రహీతలు సెప్టెంబర్​ నుంచి ఈఎంఐలు చెల్లించాలి. అయితే ఆర్​బీఐ ఇచ్చిన వెసులుబాటు వినియోగించుకున్న వారికి.. ప్రతి నెలా విధించే వడ్డీని అసలులో కలపడం వల్ల అప్పు మొత్తం అధికమవుతుంది. ఇలాంటి సమయాల్లో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే మార్గాలపై నిపుణుల సలహాలు, సూచనలు మీ కోసం.

Planning of EMIs after a moratorium
మారటోరియం తర్వాత ఈఎఐల చెల్లింపు

By

Published : Sep 6, 2020, 10:26 AM IST

Updated : Sep 6, 2020, 11:59 AM IST

కరోనా మహమ్మారి అందరి ఆదాయాలనూ తగ్గించింది. ఆర్థికంగా చాలామంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రుణ గ్రహీతలకు వెసులుబాటు కల్పించేందుకు ఈఎంఐలపై ఆరు నెలల మారటోరియాన్ని ప్రకటించింది ఆర్‌బీఐ. ఈ గడువు ఆగస్టుతో ముగిసింది. సెప్టెంబరు నుంచి రుణ వాయిదాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఆరు నెలలూ వాయిదాలను చెల్లించకుండా ఉపశమనం పొందినా.. ప్రతి నెలా విధించే వడ్డీని అసలులో కలపడం వల్ల అప్పు మొత్తం అధికమవుతుంది. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, మొత్తం ఆదాయం ఆగిపోయిన వారు.. అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇచ్చే అన్ని అవకాశాలనూ పరిశీలించి, సరైన ఎంపిక చేసుకోవాలి.

వెసులుబాటు ఉంటే...

కొవిడ్‌-19 సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకపోయినా.. కొంతమంది మారటోరియం వెసులుబాటును ఉపయోగించుకున్నారు. ఇలాంటివారు.. మారటోరియం సమయంలో విధించిన వడ్డీని ఒకేసారి చెల్లించడం మేలు. దీనివల్ల అదనపు వాయిదాల భారం ఉండదు. మారటోరియం వాడుకున్న నెలలు మాత్రమే చివరకు పెరుగుతాయి.

మార్చి 2020 నాటికి గృహరుణం రూ.20లక్షలు ఉందనుకుందాం. వడ్డీ శాతం 8. మిగిలిన వాయిదాలు 180 నెలలు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా రూ.19,113. మారటోరియం కాలంలో విధించిన వడ్డీ రూ.81,345.

ఈ సందర్భంలో మారటోరియం కాలంలో విధించిన వడ్డీ రూ.81,345 ఒకేసారి చెల్లించడం వల్ల రుణం తిరిగి రూ.20లక్షలు అవుతుంది. సెప్టెంబరు నుంచి 180 వాయిదాల్లో చెల్లించడం వల్ల చివరకు ఆరు నెలలు మాత్రమే ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. మొత్తం వడ్డీ ఒకేసారి కట్టలేకపోయినా, కొంచెం కొంచెంగా చెల్లించడం వల్ల వాయిదాల సంఖ్య పెరగకుండా చూసుకోవచ్చు.

అధికంగా చెల్లించండి..

ఆర్థిక సమస్యలు కాస్త కుదుటపడిన వారు.. వాయిదా మొత్తం కొద్దిగా పెంచేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల రుణ వ్యవధి పెరగకుండా చూసుకోవచ్చు. ప్రతినెలా కట్టాల్సిన వాయిదా కొద్దిగా పెరిగినా.. అప్పు మొదట అనుకున్న సమయంలోనే పూర్తి అవుతుంది. మిగిలిన ఆర్థిక లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. వేతన జీవులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

మార్చి 2020 నాటికి రూ.20లక్షల గృహరుణం ఉంటే.. మారటోరియం ముగిసే సమయానికి అది రూ.20,81,345కు చేరుతుంది. వడ్డీ 8శాతం చొప్పున ఉందనుకుందాం. అప్పుడు చెల్లించాల్సిన వాయిదాను రూ.20,247 చేయడం ద్వారా 174 నెలల్లోనే అప్పు పూర్తవుతుంది.

ఆదాయం లేకపోతే...

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆదాయ నష్టం తగ్గక ఇప్పుడూ వాయిదాలు కట్టడం ఆర్థిక భారమైతే.. బ్యాంకులు ఆ అప్పులను రెండు సంవత్సరాల వరకూ పునర్‌ వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉండవచ్చు. అతి త్వరలో వీటి విధానలు ప్రకటించే అవకాశాలున్నాయి. రుణగ్రహీతల ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ఆధారంగా దీన్ని మంజూరు చేస్తారు. దీనివల్ల వాయిదా కట్టలేకపోయినా ఆ అప్పులను ఎన్‌పీలుగా వర్గీకరించరు. దీనికి ముఖ్యమైన షరతు అప్పును 2020 మార్చికన్నా ముందు తీసుకొని స్టాండర్డ్‌ ఖాతా కలిగి ఉండాలి. పునర్‌ వ్యవస్థీకరణతో కట్టాల్సిన వడ్డీ శాతం పెరుగుతుంది. కాబట్టి, తప్పనిసరి అయితేనే దీని గురించి ఆలోచించండి.

తక్కువ వడ్డీ రేటుకు..

కరోనా సమయంలో ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. దీనివల్ల రెపో ఆధారిత వడ్డీలూ ఒక శాతంపైనే తగ్గాయి. ఎస్‌బీఐ, యూబీఐ వంటి కొన్ని బ్యాంకుల్లో గృహరుణంపై వడ్డీ 7శాతం కన్నా తక్కువకే ఉంది. ప్రస్తుత వడ్డీ ఎంసీఎల్‌ఆర్‌/బేస్‌రేటు ఆధారంగా ఉంటే.. రెపో ఆధారిత వడ్డీకి మారడం ద్వారా లాభం పొందవచ్చు. చాలా బ్యాంకులలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. మీ బ్యాంకులో ఈ వెసులుబాటు లేకపోతే.. ఇతర బ్యాంకుకు మారేందుకు ఆలోచించండి. ఇలా మారడానికి కొంత రుసుము ఉన్నప్పటికీ మొత్తంగా లాభమే. వడ్డీలో అరశాతం తగ్గినా దీర్ఘకాలంలో వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది.

వాయిదాల్లోనూ...

ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుటపడని వారు.. వడ్డీని ఒకేసారి చెల్లించలేని వారు.. పాత వాయిదాలను నెలనెలా చెల్లించవచ్చు. కానీ, మారటోరియం సమయంలో అప్పు మీద వడ్డీని అసలుకు కలపడం వల్ల రుణ వ్యవధి పెరుగుతుంది. 15 ఏళ్లలో పూర్తి కావాల్సిన రుణం.. మరో 15 నెలల వరకూ పెరుగుతుంది. అంటే.. 16 ఏళ్ల 3 నెలలు అయ్యే అవకాశం ఉంది.

మార్చి నాటికి ఉన్న రూ.20 లక్షల గృహరుణం. మారటోరియం ముగిసే నాటికి రూ.20,81,345 అవుతుంది. వడ్డీ శాతం 8 చొప్పున 180 నెలల్లో పూర్తి కావాల్సింది.. 195 నెలలు పడుతుంది. ప్రతి నెలా వాయిదా రూపంలో రూ.19,105 చెల్లించాలి.

ఇలాంటి సందర్భంలో రుణాన్ని తొందరగా తీర్చాలనుకుంటే.. స్టెప్‌ అప్‌ పద్ధతిని ఎంచుకోవచ్చు. దీనివల్ల ప్రతి సంవత్సరం వాయిదాను ఒక శాతం పెంచుకోవడం ద్వారా మొదట అనుకున్న సమయంలో అప్పు పూర్తిగా చెల్లించవచ్చు. అంటే, రెండో సంవత్సరంలో రూ.19,105 మీద ఒకశాతం అంటే.. రూ.19,296కు చేరుతుంది. ఈ విధంగానే ఏటా పాత వాయిదా ఒక శాతం పెంచడం వల్ల 175 నెలల్లో తీరుతుంది. అదే మూడు శాతం పెంచితే 149 నెలల్లోనే తీరుతుంది.

-రచయిత:టి. ఫణి శ్రీనివాసులు, సర్టిఫైడ్‌ ఫినాన్షియల్‌ ప్లానర్

ఇదీ చూడండి:ఆన్‌లైన్‌ ఆట.. మనదైన బాట!

Last Updated : Sep 6, 2020, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details