వ్యక్తిగత రుణాలు ఈ రోజుల్లో చాలా సులభంగా లభిస్తున్నాయి. ఆన్‌లైన్లో కొన్ని ప్రాథమిక వివరాలను అందించి దరఖాస్తు ఫారంను పూర్తిచేయడం ద్వారా కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలోనే రుణం మంజూరవుతుంది. అయితే, వ్యక్తిగత రుణాలకు ఎటువంటి హామీ ఉండదు కాబట్టి రుణ దరఖాస్తు ఆమోదించేప్పుడు బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. అవసరమైన అన్ని విషయాలను పరిశీలిస్తాయి. తమ నిబంధనల మేరకు లేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశమూ లేకపోలేదు.
దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ఈ 5 అంశాలను గుర్తుంచుకోవాలి.
1.రుణ చరిత్రను సమీక్షించండి..
బలమైన క్రెడిట్ హిస్టరీ ఉన్నవారి రుణ దరఖాస్తు ఆమోదించేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. సాధారణంగా 750కి మించి క్రిడిట్ స్కోరు ఉంటే త్వరగా రుణం మంజూరు అవుతుంది. నెలవారి ఈఎమ్ఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లించడం, క్రెడిట్ వినియోగ నిష్పత్తి 30శాతం లోపు ఉండడం, ఇతరుల రుణ ఖాతాలకు హామీగా సంతకం చేస్తే, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి అంశాలు మంచి క్రెడిట్ స్కోరు నిర్వహణకు సహాయపడతాయి.
"మీ ప్రస్తుత రుణదాతలు, క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా క్రెడిట్ స్కోరు లెక్కిస్తారు. ఏదైనా క్లరికల్ లోపం కారణంగా ఈ సమాచారం తప్పుగా నమోదైతే క్రెడిట్ స్కోరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా రుణం ఆమోదం పొందే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఈ విధంగా చేయడం వల్ల సమాచారంలో ఏమైనా తప్పులు ఉంటే సరైనా సమయంలో గుర్తించి క్రెడిట్ బ్యూరోలకు, రుణదాతలకు రిపోర్టు చేసి సరిచేసుకోవచ్చు." అని పైసాబజార్.కామ్ డైరెక్టర్ & అన్‌సెక్యూర్డ్ లోన్స్ డైరెక్టర్ గౌరవ్ అగర్వాల్ తెలిపారు.
2. తిరిగి చెల్లించే సామర్ధ్యం..
దరఖాస్తు దారుని తిరిగి చెల్లించే సామర్ధ్యం ఆధారంగా కుడా రుణాలు మంజూరు చేస్తారు. ఈఎమ్ఐలకు చెల్లించే మొత్తం, నెలవారి ఆదాయంలో 50 శాతం కంటే తక్కువుండేట్లు చూసుకోవాలి. అటువంటి దరఖాస్తులను మాత్రమే రుణ సంస్థలు పరిశీలిస్తాయి. నెలవారీ ఆదాయంలో కొంతభాగం కీలకమైన ఆర్థిక లక్ష్యాలకు కేటాయించాల్సి ఉంటుంది. వీటి కోసం నిర్ధేశించిన మొత్తాన్ని కూడా ఈఎమ్ఐకు మళ్ళిస్తే, మరింత అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో రుణ ఊబిలో చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల దరఖాస్తు దారులు, వారు చెల్లించే అన్ని రుణాల ఈఎమ్ఐలు, ఆదాయంలో 50శాతం మించకుండా చూసుకోవాలి. దాని ఆధారంగానే కాలవ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అనివార్య ఖర్చులు, పాత, కొత్త రుణాల ఈఎమ్ఐలు, ఆర్థిక లక్ష్యాల కోసం నెలవారి పెట్టుబడులు, వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని కాలవ్యవధిని ఎంచుకునేందుకు ఈఎమ్ఐ క్యాలిక్యులేటర్లు ఉపయోగించుకోవచ్చు.