గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణకు సమయం వచ్చేసింది. ఈసారి రిటర్నులను మరింత సులభం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు www.incometax.gov.in ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల ప్రాసెసింగ్‌ను మరింత వేగంగా చేయడం సహా, రిఫండ్‌నూ త్వరగా చెల్లించేందుకు ఈ సీపీసీ 2.0 అందుబాటులోకి వచ్చింది. మరి, కొత్త పోర్టల్‌లో రిటర్నులను సమర్పించేముందు మనం ఎలా సిద్ధం కావాలో ఇప్పుడు చూద్దాం.
పరిమితికి మించి ఆదాయం ఉన్నా.. లేకున్నా.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ కొత్తగా జేసన్ (జేఎస్‌ఓఎన్) యుటిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి పోర్టల్‌లో ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4ని విడుదల చేశారు. ఈ ఫారాలు ముందుగానే నింపి (ప్రీ-ఫిల్) వస్తున్నాయి. ఇందులో మీ వేతనం వివరాలు, డివిడెండ్ ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు, ఇలా.. 26 ఏఎస్‌లో అందుబాటులో ఉన్న ప్రతి వివరాలూ ఇందులోనూ కనిపిస్తాయి.
తేడా ఉంటే కుదరదు..
ఐటీ వెబ్‌సైటులోకి లాగిన్ అయ్యేందుకు పాన్ కార్డు, పాస్‌వర్డ్ ఉంటే చాలు. ఇప్పటివరకూ రిటర్నులు దాఖలు చేయని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మర్చిపోయిన వారు.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైటులోకి లాగిన్ కావచ్చు. కానీ, పాన్ కార్డులో ఉన్న పేరు, బ్యాంకింగ్ ఖాతాలో ఉన్న పేరుతో ఒకేలా ఉండాలి. ఐటీ శాఖ వద్ద నమోదైన ఫోన్ నెంబరు, ఇ-మెయిల్, బ్యాంకుల వద్ద ఉన్న వివరాలతో సరిపోకపోయినా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీ వెబ్‌సైటులోకి లాగిన్ అవ్వడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాస్‌వర్డ్ కొత్తగా నమోదు చేయడమే మేలు. ఆధార్ ఓటీపీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ ఆధార్-పాన్ కార్డును అనుసంధానం చేయకపోతే ముందుగా ఆ ప్రక్రియను పూర్తి చేయండి. పోర్టల్‌లోకి వెళ్లిన తర్వాత మీ తాజా వివరాలను అప్‌డేట్ చేయడం మంచిది.
ఏ ఫారంలో..
మీరు ఆదాయాన్ని ఆర్జించిన మార్గాలను బట్టి, ఏ ఫారంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. సరైన ఫారంలో రిటర్నులు దాఖలు చేయడం ఇక్కడ ప్రధానం. సరైన పత్రాన్ని వినియోగించకపోతే ఆదాయపు పన్ను శాఖ దాన్ని ‘డిఫెక్టివ్ రిటర్న్’గా పరిగణిస్తుంది. ఉదాహరణకు వేతనం, డివిడెండ్ ఆదాయం, వడ్డీ ఆదాయం ఉన్న వారు ఐటీఆర్ 1 దాఖలు చేస్తే సరిపోతుంది. అదే.. మూలధన లాభాలు ఉన్నప్పుడు ఉద్యోగులూ ఐటీఆర్ 2 వేయాల్సి ఉంటుంది.
ఆధారాలన్నీ ఒకేచోట..