రోడ్డుపైకి వాహనంతో వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రోడ్లపై గుంతలు, అవతలి వాహనదారుడికి సరిగ్గా నడపటం రాకపోవవటం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు అకస్మికంగా బండిలో ఏదైన సమస్య రావటం కావచ్చు.. ఇలా ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బీమా కొండంత ధీమా ఇస్తుంది. ఆర్థిక భారం పడకుండా మనకు అండగా ఉంటుంది.
కాబట్టి.. వాహన బీమా తీసుకోవటం వల్ల కొంత వరకు నిశ్చింతగా ఉండొచ్చు. కంపెనీలను బట్టి కవరేజీ మారుతుంటుంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బీమా తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత చేసేల చిన్న చిన్న పొరపాట్ల వల్ల క్లెయిమ్ ప్రక్రియలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైన తర్వాత చేసిన పొరపాటు గ్రహిస్తారు. ఇలా సాధారణంగా ఎక్కుమంది చేసే పొరపాట్లు సహా.. మీకు అలాంటి సమస్య రాకుండా క్లెయిమ్ ప్రక్రియ సులభంగా జరిగేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎఫ్ఐఆర్
దొంగతనం, ఎవరైనా వాహనాన్ని ద్వంసం చేయడం వంటి కేసుల్లో వాహన బీమా పొందేందుకు ప్రథమ సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) తప్పనిసరిగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని, క్లెయిమ్ దరఖాస్తుతో పాటు జత పరచాల్సి ఉంటుంది. బీమా సంబంధిత అన్ని అంశాల్లో ఎఫ్ఐఆర్ అవసరం లేదు. అయితే ఎఫ్ఐఆర్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది.
డాక్యుమెంటేషన్
బీమా మంజూరులో డాక్యుమెంట్లు చాలా కీలకం. క్లెయిమ్ మంజూరులో చేసేందుకు బీమా సంస్థ.. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్లను సమర్పించాలని అడగవచ్చు. ఇవి లేనట్లయితే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా పాలసీ వ్యాలిడిటీని తనిఖీ చేసుకోవాలి. కొన్ని సార్లు బీమా గడువు ముగిసిన గమనించకపోవచ్చు.
ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవటం
క్లెయిమ్‌కు సంబంధించిన దరఖాస్తు ఎంత వీలైతే అంత త్వరగా చేసుకోవాలి. ప్రమాదం జరిగిన మూడు రోజుల్లో క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవటం ద్వారా బీమా పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆలస్యం అయిన కొద్దీ క్లెయిమ్ పొందటం కష్టతరం అవుతుంది.