తెలంగాణ

telangana

ETV Bharat / business

Home loan interest rate: ఇంటి కోసం ఎంత అప్పు చేయొచ్చు? - వేతనంలో హోం లోన్​ ఈఎంఐ ఎంత ఉండొచ్చు

బ్యాంకు ఖాతాలో ఎన్ని లక్షలు, కోట్ల రూపాయలు ఉన్నా.. సొంతిల్లు లేకుంటే సంతృప్తిగా ఉండదు చాలామందికి. ఆర్జించడం ప్రారంభించగానే.. ఇల్లు తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నవారూ ఉంటున్నారు. తక్కువ వడ్డీ రేటుకు గృహరుణం (Home loan interest rate) లభిస్తుండటం, దానికి ఆదాయపు పన్ను మినహాయింపూ లభించడం అదనపు కారణాలు అవుతున్నాయి. అయితే, సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో ఎంత మేరకు అప్పు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.

How Much Should A Home Loan Be
హోం లోన్ ఎంత ఉండాలి

By

Published : Aug 20, 2021, 8:04 AM IST

విలువ పెరిగే ఆస్తులకు అప్పు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, అదీ మన శక్తికి మించి ఉండకూడదు. రుణం తీసుకోవడం వల్ల మన ఇతర ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అందుకే ఇంటి రుణం (Home loan interest rate) తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఇంటి రుణం ఎంత ఉంటే మనకు సులువుగా ఉంటుంది అనేది చూసుకోవాలి. సాధారణంగా మన ఆరేళ్ల ఆదాయం ఎంత ఉంటుందో.. ఆ విలువ మేరకు ఇల్లు తీసుకోవడం మంచిది. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం రూ.12లక్షలు అనుకుందాం.. అప్పుడు మీ ఇంటి విలువ రూ.72లక్షల వరకు ఉండొచ్చు. ఈ మొత్తంలో 15-20 శాతం వరకు మీ దగ్గర సొంత డబ్బు ఉండాలి. అది మార్జిన్‌ మనీగా ఉపయోగించుకుని, మిగతా మొత్తానికి హోం లోన్​ తీసుకోవచ్చు.

పెరిగే ఖర్చులను దృష్టిలో ఉంచుకుని..

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు, లేదా కట్టిన ఇల్లు కొనేటప్పుడు కచ్చితంగా ఎంత ఖర్చు అవుతుందన్న లెక్క తెలుస్తుంది. కానీ, ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఎంతలో అది పూర్తి అవుతుందనేది అంచనాకు అందకపోవచ్చు. కాబట్టి, బ్యాంకు నిబంధనల మేరకు 15-25 శాతం మార్జిన్‌ మనీ సరిపోయినా.. ఇంటి నిర్మాణం చేపట్టే వారికి ఇంటి విలువలో 15-25శాతం అధికంగానే వినియోగించాల్సి రావచ్చు. కాబట్టి, పెరిగే ఖర్చులకు అనుగుణంగా మీ రుణ మొత్తాన్ని ఎంచుకోవాలి.

ఉద్యోగ భద్రతతో నెలవారీ స్థిరంగా ఆదాయం ఆర్జించేవారు నెలకు ఎంత మేరకు వాయిదాలు చెల్లించగలరనేది నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం ఇంటి రుణాన్ని తీసుకోవాలి. వ్యాపారంలాంటి అస్థిర ఆదాయం ఉన్నవారు కనీసం ఏడాదికి సరిపడా వాయిదాల మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు రూ.40లక్షల రుణం సరిపోతుంది. మీ రుణ వాయిదా నెలకు రూ.40 వేలు అనుకుందాం. కరోనా వంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వ్యాపారం సరిగా నడవక వాయిదాలు ఆగే ఆస్కారం ఉండవచ్చు. ఇలాంటి వాటికి ముందే సిద్ధం కావాలి. మీ రుణ అర్హతను బట్టి, కనీసం ఏడాది వాయిదాకు సరిపోయేలా మరో రూ.5లక్షలను కలిపి, రూ.45 లక్షలకు రుణం తీసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే.. ఆర్థిక పరిస్థితిని బట్టి, నెల వాయిదాలో రూ.40వేలకు అదనంగా చెల్లిస్తూ ఉండండి.

ఇల్లు కొన్నప్పడు చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీలు ఇంటి విలువలో భాగం కావు. కాబట్టి, వాటికి ఇంటి రుణం (Home loan interest rate) ఇవ్వరు. ఈ ఖర్చులకు అయ్యే మొత్తాన్ని సొంతంగా భరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

ఇంటిలో ఇంటీరియర్‌ లాంటివి చేయించుకునేందుకు ఇంటి విలువలో 10-20 శాతం ఖర్చు అవుతుంది. కాబట్టి, వీటికి అయ్యే ఖర్చులనూ కలిపి రుణానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటి నిర్మాణం ఆ తర్వాతే..

మీ ఇంటి నిర్మాణ దశలను బట్టి, రుణాన్ని బ్యాంకు విడుదల చేస్తుంది. పునాది పూర్తయ్యాక కొంత, శ్లాబు వేశాక, గోడలు పూర్తయ్యాక.. ఇలా విడతల వారీగా రుణం మీ చేతికి వస్తుంది. కానీ, ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్టీలు, సిమెంటుకు అడ్వాన్సుగా చెల్లిస్తే రేటులో రాయితీ లభిస్తుంది. ఇంటికి కావాల్సిన కలపను ముందుగానే కొనుగోలు చేసి, ఆ కలపలో తేమ పూర్తిగా పోయే వరకు ఎండిన తర్వాత ద్వారాలు, కిటికీలు, ఫర్నిచర్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్మాణ ప్రారంభంలోనే అధిక వ్యయం అవుతుంది. కాబట్టి, బ్యాంకు నిబంధనల మేరకు అవసరం అయిన మార్జిన్‌ మనీకన్నా అధిక మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాతే ఇంటి నిర్మాణం ప్రారంభించడం ఉత్తమం.

అద్దెకు రెట్టింపు వరకు ఈఎంఐ..

ఇల్లుకు అవసరమైన మొత్తం డబ్బు మీ దగ్గర ఉందనుకుందాం.. భవిష్యత్‌లో పిల్లల చదువులు, వారి వివాహం, అనుకోని అనారోగ్య ఖర్చులు ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు అత్యవసర నిధి ఏర్పాటూ అవసరమే. వీటికి కేటాయింపులు పూర్తి చేశాక, మిగిలిన మొత్తమే ఇంటి కోసం వెచ్చించండి. అప్పుడు అవసరమైన మొత్తానికి గృహరుణం తీసుకోండి. ఇతర ఏ రుణాలతో పోల్చినా..గృహరుణానికి వడ్డీ భారం చాలా తక్కువ.

ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెకు రెట్టింపు వరకు ఇంటి రుణ వాయిదా ఉండొచ్చు. ఉదాహరణకు ఇంటి అద్దె రూ.20వేలు అనుకుంటే.. సొంతింటికి వెళ్లాక ఆ ఇంటి కోసం తీసుకున్న రుణానికి వాయిదా రూ.40,000 మించకుండా ఉండాలి. అప్పుడు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాకపోవచ్చు.

సాధారణంగా మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం మించకుండా రుణ చెల్లింపుల వాయిదాలు ఉండేలా బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుంది. అధిక ఆదాయం ఉన్న వారికి నెలవారీ ఆదాయంలో 55-60శాతం వరకు రుణ వాయిదాలు ఉండేలా కూడా బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి.

రచయిత- వంగ రాజేంద్ర ప్రసాద్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details