వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిమిత హామీ మొత్తంతో కూడిన ఒక జీవిత బీమా పాలసీ సరిపోవచ్చు. అదే వ్యక్తి 50 సంవత్సరాల వయసుకు చేరేసరికి.. ఒక కుటుంబానికి మూలధారం కావచ్చు. సాధారణంగా చిన్న కుటుంబాలలో నలుగురు సభ్యులుంటారు. వీరితో పాటు సీనియర్ సిటిజన్లు అయిన తల్లిదండ్రులను బాధ్యతలు చూడాల్సి రావచ్చు.
అలాంటప్పుడు ఉన్న ఒక్క బీమా పాలసీ అదనపు ఖర్చులకు సరిపోతుందా? కుటుంబ ఆర్థిక రక్షణకు, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చేందుకు ఒక పాలసీ సరిపోదనుకుంటే.. అవసరానికి తగినట్లు.. సమయానుసారం అదనపు పాలసీలను కొనుగోలు చేయవచ్చా? ఒకవేళ కొనుగోలు చేస్తే పాలసీలన్నింటిని ఎలా నిర్వహించాలి?
రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలను క్లెయిమ్ చేసుకోవడం సాధ్యమే. అయితే ఇది పాలసీదారుడు బీమా అవసరాలు, ఏ ప్లాన్ కొనుగోలు చేశారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా పాలసీదారులకు ఎంత వరకు బీమా అందించవచ్చు అనే విషయమై బీమా సంస్థలకు కూడా నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నాయి. పాలసీ కొనుగోలు చేసిన వ్యక్తి ఆదాయం, వయసు, ప్రీమియం చెల్లింపుల సామర్ధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంత మొత్తం హామీగా ఇవ్వచ్చు.. అనేది నిర్ణయిస్తాయి బీమా సంస్థలు. ఏదేమైనా ఒక వ్యక్తి రెండో పాలసీ కొనుగోలు చేయాలనుకుంటే, రెండు పాలసీల గురించి బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. అదే విధంగా రెండో జీవిత బీమా పాలసీని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలి.
పాలసీల నిర్వహణ సులభమే..
రెండు పాలసీలను తీసుకున్న వారు, వాటిని నిర్వహించడం చాలా ముఖ్యం. యాక్టివ్గా ఉంచేందుకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా వరకు ఆర్థిక లావాదేవీలు డిజిటల్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఈ డిజిటల్ విధానంలో పారదర్శకత పెరగడం వల్ల.. రెండు లేదా అంతకంటే ఎక్కువ పాలసీలను కొనుగోలు చేసిన వారు ఈ-ఇన్సూరెన్స్ ఖాతా ద్వారా సరైన విధంగా పాలసీలను నిర్వహించవచ్చని రెన్యూబై ఇన్సుర్టెక్ సహ-వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ ఛటర్జీ తెలిపారు.