తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2021, 6:32 AM IST

Updated : Jan 29, 2021, 7:17 AM IST

ETV Bharat / business

అనగనగా ఒక ఆర్థిక సింహం

ఆ దేశంలో నేసిన వస్త్రాలు.. తయారైన లోహ పరికరాలు... సుగంధ ద్రవ్యాలు.. జిగేల్‌మనే వజ్రాలు... అక్కడ అందంగా మలచిన అలంకార వస్తువులు... మట్టి పాత్రలు ప్రపంచాన్ని వెర్రెత్తించాయి. ఆ దేశ నౌకలు సముద్రాలను శాసించాయి. ప్రపంచ ఆర్థిక రంగాన్ని శతాబ్దాలపాటు తమ వెంట తిరిగేలా చేశాయి. కాలక్రమంలో అదే దేశం... అనేక ఆటుపోట్లకు గురైంది. ఆ దేశం ఏది..? ప్రస్తుత పరిస్థితి ఏమిటి...?

how india lost its economical strength Indian Economy Estimations from 1st century
అనగనగా ఒక ఆర్థిక సింహం

  • ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్థిక శక్తి- భారత్‌!
  • ప్రపంచ జీడీపీలో అత్యధిక వాటాదారు- భారత్‌!
  • ప్రపంచ ఆర్థిక దిగ్గజం- భారత్‌!

ఏంటీ పగటి కలలు కంటున్నారనుకుంటున్నారా? లేక భవిష్యత్‌ ఊహాగానాలు చేస్తున్నారనుకుంటున్నారా? కానే కాదు. నిప్పులాంటి నిజం. ఒకటి కాదు.. రెండు కాదు... వంద కాదు... ఏకంగా 1500 సంవత్సరాలు భారత్‌ ప్రపంచ ఆర్థిక దిగ్గజం! అమెరికా, బ్రిటన్‌ల జీడీపీ 5% దాటని రోజుల్లోనే మనం 30ల్లో ఉన్నాం. అలనాటి ఆర్థిక సింహం భారత్‌ కథేంటో... అదెలా క్షీణించిందో... బడ్జెట్‌ వేళ... చూద్దాం రండి!

వివిధ దేశాల ఆర్థిక కార్యకలాపాల చరిత్రను వెలికితీసి, వర్తమానంలో ప్రగతికి సహకారం పెంపొందించేందుకు 1961లో ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ-ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ డెవలప్‌మెంట్‌) అవతరించింది. అందులో అమెరికా, బ్రిటన్‌, భారత్‌తో సహా 37 దేశాలకు సభ్యత్వముంది. ఓఈసీడీ సూచనతో బ్రిటన్‌ ఆర్థిక చరిత్రకారుడు ఆగ్నస్‌ మాడిసన్‌ ఆధ్వర్యంలో 2001లో ‘దివరల్డ్‌ ఎకానమి- ఎ మిలీనియం పర్‌స్పెక్టివ్‌’ అనే గ్రంథం వెలువడింది. అందులో రాసిన ప్రకారం... క్రీ.శ. 1వ సంవత్సరం నుంచి క్రీ.శ. 1500 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారతదేశం మకుటం లేని మహారాజులా ఏలింది. దేశాన్ని ఔరంగజేబు పాలించే నాటికి కూడా పట్టును కొనసాగించింది. ప్రపంచాన్ని ఇంతలా శాసించిన హిందుస్థాన్‌ను ఎలా పాతాళంలోకి తొక్కేశారో ఎంపీ శశిథరూర్‌ తన పుస్తకం ‘ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌’లో వివరంగా విశ్లేషించారు.

మన గతం మహోన్నతం

భారత్ గణాంకాలు

విశాల హిందూ మహా సముద్రాన్ని, అరేబియా, బంగాళాఖాతాన్ని భారత నౌకలు తమ కార్యక్షేత్రంగా చేసుకుని ప్రపంచమంతా చుట్టేసేవి. అత్యంత నాణ్యమైన నూలు దుస్తులు, మెత్తటి పట్టు, ఊలు వస్త్రాలు, ఇనుము, ఉక్కుతో తయారైన వస్తువులు, కత్తులను, నాణ్యమైన సుగంధ ద్రవ్యాలను, నీలిమందును మోసుకెళ్లేవి. వాటిస్థానంలో వెండి, బంగారంతో తిరిగొచ్చి భారత్‌ను సుసంపన్నం చేసేవి. పోర్చుగీసు, ఫ్రెంచి, బ్రిటిష్‌ వర్తక సంఘాలు మన గడ్డపై అడుగు పెట్టాక సంపద వెల్లువకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది.

దోపిడీ ఎలా మొదలైందంటే...

ప్రస్తుతం ఇలా..

బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీ పెత్తనం విస్తరించాకనే భారత ఆర్థిక వ్యవస్థ క్షీణదశ మొదలైంది. వారు మొదట వస్త్ర, తర్వాత లోహ, నౌకల తయారీ, వృత్తిపని రంగాలపై పథకం ప్రకారం పన్నులు పెంచుతూ దెబ్బతీశారు. బ్రిటన్‌ నుంచి భారత్‌కు 1830 వరకు యంత్రాలపై నేచిన 60 మిలియన్‌ గజాల వస్త్రం దిగుమతి జరగ్గా... అది 1858కి వచ్చే సరికి 968 మిలియన్‌ గజాలకు పెరిగింది. 1870 వచ్చే సరికి ఏకంగా బిలియన్‌ గజాలకు చేరుకుంది. దేశీయ వస్త్రం కంటే తక్కువ ధరకు లభిస్తుండటంతో పేద భారతీయులు వాటినే కొనడం ప్రారంభించారు. వృత్తి పనివారల వస్తువులకు సైతం గిరాకీ పూర్తిగా తగ్గిపోయి గ్రామీణ భారతం కుదేలైంది. వ్యవసాయమూ దెబ్బతింది.

  • ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలతో భారత్‌ నుంచి లండన్‌ కోశాగారానికి 1765 నుంచి 1815 వరకు ప్రతి ఏడాది ఏకంగా 180 మిలియన్‌ పౌండ్లు వెళ్లాయి. ప్రస్తుత కరెన్సీలో అది రూ.1440 కోట్లు!
  • 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి బ్రిటన్‌ సామ్రాజ్యం 3.25 లక్షల సిద్ధ సైన్యాన్ని పోషించేది. వీరందరి జీతాలతోపాటు రెండు ప్రపంచ యుద్ధాలలో బ్రిటన్‌ తరఫున పాల్గొన్న సైనికుల ఖర్చుల్లో అత్యధికం పేద భారతదేశమే భరించింది.
  • భారత్‌లో టేకు, సాల్‌ కలప, ఇత్తడి రేకులతో తయారైన 400 నుంచి 500 టన్నుల బరువున్న మన్నికైన నౌకలు ప్రపంచాన్ని శాసించేవి. వీటి తయారీ కేంద్రాలను మూసేయడం ద్వారా ఇక్కడ వేలాది మంది పనులు కోల్పోయారు. ఇది వృద్ధిపై ప్రభావం చూపింది.

పరిస్థితి మారుతోందిలా

18వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్‌ సామ్రాట్‌ ఔరంగజేబు పాలనలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ భాగస్వామ్యం 27% ఉండేది. బ్రిటిషర్లుఇండియా నుంచి వెళ్లిపోతున్న సమయంలో అది 3 శాతానికి దిగ జారింది. స్వాతంత్య్రం వచ్చాక వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, శాస్త్ర, సాంకేతిక, సేవా రంగాలపైప్రభుత్వాల ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే 2019లో బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వ్యవస్థగా అవతరించింది. కరోనా కారణంగా ప్రస్తుతం 6వ స్థానానికి దిగజారినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గణాంకాలు చెబుతున్నాయి. అయితే... 2050 సంవత్సరం వరకు భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచే అవకాశముందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

Last Updated : Jan 29, 2021, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details