గత కొన్నేళ్లుగా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) మంచి గమ్యస్థానంగా మారింది. ఇతర చిన్న మొత్తాల పెట్టుబడి పథకాలతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ రాబడిని ఇస్తుంది. పన్ను ప్రయోజనాలనూ కల్పిస్తుండటం వల్ల చాలా మంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు.
ఈపీఎఫ్ గురించి..
ఈపీఎఫ్ పథకం ఒక రిటైర్మెంట్ పథకం. ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, వారి సంస్థ జమ చేసిన మొత్తంపై వార్షికంగా వడ్డీ వస్తుంది. రిటైర్మెంట్ అనంతరం నెలవారీ పింఛను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6 కోట్ల ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు.
2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని ఖరారు చేసింది కార్మిక మంత్రిత్వ శాఖ.
2018-19లో అందించిన 8.65 శాతం, 2017-18 లో అందించిన 8.55 శాతం వడ్డీ రేటుతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందిస్తున్న 5-7 శాతం కంటే ఎక్కువ.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వ సెక్యూరిటీల ఆధారంగా మారుతుంటాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
ఇది జనాదరణ పొందిన పథకం. ప్రస్తుతం దీనిలో ఉన్న వడ్డీ రేట్లు 7.1 శాతం. వార్షికంగా వడ్డీ కాంపౌండ్ అవుతుంది. ఈ పథకంలో చేసిన పొదుపుతో పాటు దాని మీద వచ్చే రాబడికి కూడా పన్ను మినహాయింపు ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ)
ఇది ప్రభుత్వం జారీ చేసే బాండ్. 6.8 శాతం వడ్డీని అందిస్తుంది. ఇది వార్షికంగా పెట్టుబడిదారులకు అందుతుంది. ఈ పథకం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటుంది. పోస్టాఫీస్ ద్వారా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర
కిసాన్ వికాస్ పత్ర 6.9 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. సంవత్సరం వారీగా కాంపౌండ్ అవుతుంది. మెచ్యూరిటీ సమయం 124 నెలలు. పోస్టాఫీస్ ఆఫీసులు దీన్ని అందిస్తాయి. దీనిలో పెట్టుబడికి, అదే విధంగా వడ్డీకి ఎలాంటి పన్ను రిబేట్ లభించదు.
సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై)
ఇది ఆడపిల్లలకు సంబంధించిన పథకం. దీనిపై లభించే వడ్డీ 7.6 శాతం. అసలు మొత్తంపై వార్షికంగా వడ్డీ జమ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసుల్లో లేదా బ్యాంకుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు తెరవవచ్చు. అమ్మాయికి 21 సంవత్సరాలు నిండిత తర్వాత లేదా పెళ్లి అయినప్పుడు(18 సంవత్సరాల వయస్సు వచ్చిన అనంతరం) ఈ ఖాతా మెచ్యూరిటీ అవుతుంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతా(ఎస్సీఎస్ఎస్)
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికే ఈ పథకం. దీని వ్యవధి 5 సంవత్సరాలు. ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. త్రైమాసికానికి ఓ సారి దీనిని చెల్లిస్తారు.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయం పథకం
ఐదు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం(ఎంఐఎస్)లో నెలవారీగా వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం వడ్డీ 6.6 శాతంగా ఉంది.
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు ఒకటి నుంచి 3 సంవత్సరాల వ్యవధిలో లభిస్తాయి. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. త్రైమాసికం వారీగా వడ్డీ పొందవచ్చు. ఐదు సంవత్సరాల డిపాజిట్ లో 6.7 శాతం వడ్డీ లభిస్తుండగా.. త్రైమాసికం వారీగా దీనిని చెల్లిస్తారు. ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ 5.8 శాతం వడ్డీ రేటుతో ఉంది.
పైన తెలిపిన వడ్డీ రేట్లు అక్టోబర్-డిసెంబర్ 2020 త్రైమాసికానికి సంబంధించినవి.
ఇదీ చూడండి:ఈపీఎఫ్ ఖాతాల్లో ఈ నెలలోనే 8.5% వడ్డీ జమ!