తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2019: పన్ను పరిమితి పెరిగేనా..?

రూ.5లక్షల వరకు ఆదాయం ఉంటే... పన్ను లేదు. అందుకు ఒక్క రూపాయి ఎక్కువైనా... వసూళ్ల మోతే. మధ్యంతర బడ్జెట్​లో మోదీ సర్కార్ ప్రకటించిన 'పన్ను రిబేటు' కారణంగా ఏర్పడ్డ పరిస్థితి ఇది. అయితే... రిబేటు లెక్కల చిక్కుల నుంచి తప్పించి... రూ.5లక్షల వరకు పూర్తి స్థాయి పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది ప్రజల ఆశ. మరి మోదీ సర్కార్​ ఏం చేస్తుంది?

By

Published : Jun 29, 2019, 5:19 PM IST

పద్దు 2019: పన్ను పరిమితి పెరిగేనా..?

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని డిమాండ్​

"ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలి"... ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్​. రూ. 5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలన్న వాదన ఉంది. తిరిగి అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ మొదటి సారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందున ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఆదాయ పన్నుకు సంబంధించి ఎన్డీఏ 1.0 ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్లాబులు, డిడక్షన్‌లలో ప్రధాన మార్పులు జరిగాయి. వాటన్నింటి అనంతరం ప్రస్తుతం రూ. 2.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 5 శాతం స్లాబులో ఉంటారు. రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నవారు 20 శాతం స్లాబులో ఉన్నారు. రూ.10 లక్షల పైన ఆదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఎన్డీఏ 1.0 హయాంలో ...

2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు స్థాయిని రూ.2.5 లక్షలకు పెంచారు. అది అప్పటి వరకు రూ.2 లక్షలుగా ఉండేది. 2015 బడ్జెట్‌లో ఆరోగ్య బీమా ప్రీమియం లాంటి వాటిపై డిడక్షన్‌ను పెంచారు. 2016 బడ్జెట్‌లో మొదటిసారిగా రూ. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి అప్పటి వరకు అందిస్తున్న రిబేటు రూ.2 వేలను రూ.5 వేలకు పెంచారు.

2017 బడ్జెట్​లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 10 శాతం స్లాబుని మార్చారు. ఫలితంగా రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం వారు 5 శాతం పన్నుతో ఊరట చెందారు. 2018 బడ్జెట్‌లో అన్ని రకాల డిడక్షన్స్‌ స్థానంలో స్టాండర్ట్‌ డిడక్షన్‌ను ప్రవేశపెట్టారు.

మధ్యంతర బడ్జెట్‌..

ఎన్నికలకు ముందు బడ్జెట్​లో పలు ప్రజాకర్షక చర్యలు చేపట్టింది ఎన్డీఏ 1.0. రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి పూర్తి స్థాయిలో పన్ను రిబేటు ప్రకటించింది. స్టాండర్ట్‌ డిడక్షన్‌ను రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచింది.

ఈ పన్ను రిబేటు... మినహాయింపుతో పోల్చితే భిన్నమైనది. ఇది కేవలం 5 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికే వర్తిస్తుంది. అంతకన్నా పెద్ద స్లాబులలో ఉన్న వారికి వర్తించదు. అంటే 5 లక్షల ఆదాయం ఉన్న వారిపై అంతిమంగా ఎలాంటి పన్ను పడదు. కానీ అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువైనా పాత స్లాబులే వర్తిస్తాయి.

ఆశల్లో ప్రజలు

మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన రిబేటుపై విమర్శలూ ఉన్నాయి. వాటన్నింటినీ దూరం చేస్తూ ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అయితే బడ్జెట్‌లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉందా? లేదా? అన్నదానిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

లోక్‌సభలో ఎన్డీఏ, భాజపాకు పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా ఇలాంటి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకోకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎన్నికలు లేకపోవటం వారి వాదనకు బలం చేకూరుస్తోంది.

కొందరి వాదన మరోలా ఉంది. ప్రస్తుతం వినియోగ గిరాకీ పడిపోతోంది. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలంటే డిమాండ్​ పెంచడం అవసరం. అందుకోసం పూర్తి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details