రుణం ఆమోదించేందుకు రుణదాతలు ప్రధానంగా రెండు విషయాలను చూస్తారు. ఒకటి క్రెడిట్ స్కోరు(రుణ చరిత్ర), రెండు ఆదాయం. రుణాలు మంజూరు చేసేందుకు ప్రతి బ్యాంకుకు కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. బ్యాంకులు కావలసిన కనీస అర్హతలు ఉన్న వారికే రుణాన్ని ఆమోదిస్తాయి. లేదంటే దరఖాస్తును తిరస్కరిస్తాయి.
రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి స్థిరమైన ఆదాయం ఉందా.. అనే అంశాన్ని ముందుగా పరిశీలిస్తాయి బ్యాంకులు. దీంతో పాటు వ్యక్తి వయసు, నివాసం, విద్యార్హతలు వంటి వాటినీ పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తులో తప్పులు.. అంటే పేరు, వయస్సు, చిరునామా వంటివి లోన్ అప్లికేషన్‌లో తప్పుగా ఎంటర్‌చేస్తే.. బ్యాంకులు, దరఖాస్తుదారుని గురించి కావలసిన సమాచారాన్ని సేకరించడం కష్టం అవుతుంది. దీంతో దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంటుంది.
రుణ దరఖాస్తు తిరస్కరించడానికి కారణాలు..
వయసు, సర్వీసు ఉన్న కాలం, ఈఎంఐ..
రుణం తిరిగి చెల్లించే కాలవ్యవధి కూడా రుణ అర్హతను నిర్ణయిస్తుంది. మీరు వయసులో చిన్నవారై ఉండి.. రుణం తిరిగి చెల్లింపులకు ఎక్కువ కాలవ్యవధి ఉంటే.. తక్కువ ఈఎంఐతో రుణం తీర్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా ఆమోదించే అవకాశం ఉంది. అదే మీ వయసులో పెద్ద వారై.. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారైతే రుణం తీర్చేందుకు తక్కువ కాలవ్యవధి ఉంటుంది. ఈఎంఐ పెరుగుతుంది. అంతేకాకుండా మీ ఆదాయంలో నిర్దిష్ట శాతం వరకు మాత్రమే ఈఎంఐ ఉండాలని పరిమితి విధిస్తాయి రుణసంస్థలు. సాధారణంగా నెలవారీ ఆదాయంలో 50 శాతం లోపల ఈఎంఐ ఉండాలి. అంతకు మించి ఈఎంఐ చెల్లించాల్సి వస్తే రుణ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది.