కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 17న(శుక్రవారం) జీఎస్టీ మండలి 45వ సమావేశం జరగనుంది. కరోనా విజృంభణ తర్వాత ప్రత్యక్షంగా జరనున్న తొలి సమావేశం ఇదే కానుంది. ఈ సారి భేటీలో పెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశం పరిశీలనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆమోదం లభిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
దీనితో పాటు.. కొవిడ్ అత్యవసరాలపై జీఎస్టీ మిహహాయింపును ఇంకొన్నాళ్లు పొడిగించే అంశంపై కూడా కౌన్సిల్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జీఎస్టీ (వస్తు సేవల పన్ను) 2017 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే వ్యాట్ వంటివాటిని ఒక దగ్గర చేర్చి.. అమలులోకి తెచ్చిందే జీఎస్టీ. అన్ని వస్తు సేవలకు దీనిని వర్తింపజేసిప్పటికీ.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజ వాయువు, ముడి చమురు వంటి వాటిపై మాత్రం పాత పన్నుల విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది కేంద్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై సుంకాల ద్వారా అధికంగా ఆదాయాన్ని గడిస్తున్నాయి. అందుకే వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే సాహసం చేయలేకపోయాయి.
ఇదీ చదవండి:TATA Stryder bikes: ఒకసారి ఛార్జింగ్‌తో 60 కి.మీ. ప్రయాణం