కరోనా మహామ్మారి నేపథ్యంలో పన్ను ఆదాయంపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నేడు సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ఆదాయాలపై కరోనా ప్రభావం సహా నిలిచిపోయిన ఆదాయాన్ని పునరుద్ధరించే మార్గాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ.. రాష్ట్రాలకు పరిహారంపై చర్చ! - GST counil meeting
జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సందర్భంగా పన్ను ఆదాయం, రాష్ట్రాలకు పరిహారాల చెల్లింపులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీలో పాల్గొననున్నారు.
![జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ.. రాష్ట్రాలకు పరిహారంపై చర్చ! GST council 40th meeting will held today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7580281-406-7580281-1591918562606.jpg)
జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి గడువు పొడగించడం సహా వసూళ్లు తగ్గిపోయినందున ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్లను కేంద్రం వెల్లడించలేదు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాలను భర్తీ చేసేలా పరిహారాన్ని చెల్లించే మార్గాలను కూడా కౌన్సిల్ చర్చించనుంది. పరిహారం చెల్లించేందుకు మార్కెట్ నుంచి జీఎస్టీ కౌన్సిల్ రుణాలు తీసుకోవడంపై చట్టబద్ధతను కేంద్రం పరిశీలిస్తుందని గత కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. అటు, 2017 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేయనందుకు ఆలస్య రుసుము మాఫీ గురించి కూడా కౌన్సిల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.