తెలంగాణ

telangana

ETV Bharat / business

బాండ్ల పేరుతో సుంకాల బాదుడు.. పెట్రో మోత అందుకే! - పెట్రోల్ ధరలపై నిర్మలా సీతారామన్ స్పందన

పెట్రోల్​, డీజిల్ ధరలపై సుంకాలను తగ్గించే ప్రణాళికేది తమ వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman on petrol price) ఇటీవల పేర్కొన్నారు. యూపీఏ సర్కారు హయంలో జారీ చేసిన ఆయిల్​ బాండ్లకు వడ్డీ, ఆసలు చెల్లింపులు ఇంకా పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే బాండ్ల చెల్లింపునకు కావాల్సిన మొత్తం కన్నా మూడు రెట్లు అధిక ఆదాయాన్ని.. ఎక్సైజ్​ సుంకాల (Excise duty on petrol) ద్వారా.. నాలుగు నెలల్లోనే గడించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tax income rise hugely
భారీగా పెరిగిన సుంకాల ఆదాయం

By

Published : Sep 5, 2021, 7:41 PM IST

'యూపీఏ ప్రభుత్వ హయాంలో రాయితీపై ఇంధనం సరఫరా చేయడానికి ప్రభుత్వరంగ రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లను (UPA oil bonds) జారీ చేశారు. దీనిపై గత ఏడేళ్లుగా మా ప్రభుత్వం రూ.70,196 కోట్ల వడ్డీ చెల్లించింది. అసలు కింద రూ.3,500 కోట్లే చెల్లించాం. మిగిలిన మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోగా చెల్లించాలనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ సుంకం (Excise duty on petrol) తగ్గించే అవకాశం లేదు'-ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నుంచి ఊరట కల్పించడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman on petrol price) చేసిన వ్యాఖ్యలు ఇవి. కొద్దిరోజులకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ కూడా ఇదే తరహా సమాధానం ఇచ్చారు. కానీ ఆయిల్‌ బాండ్ల పేరుతో ప్రజలపై భారం మోపుతూ ఖజానా నింపుకుంటున్నారన్న విషయాన్ని ప్రభుత్వ లెక్కలే బహిర్గతం చేస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో పెట్రో ఉత్పత్తుల (పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజ వాయువు)పై వసూలైన ఎక్సైజ్‌ సుంకం మొత్తం గతేడాదితో పోలిస్తే 48 శాతం పెరగడం గమనార్హం. ఒక్క పెరిగిన ఆదాయం లెక్క తీసుకున్నా ఈ ఏడాది చెల్లించాల్సిన ఆయిల్‌ బాండ్ల మొత్తం కంటే 3 రెట్లు అధికం కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) డేటా ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.

రూ.1.3 లక్షల కోట్లు! కాదు కాదు.. రూ.1.5 లక్షల కోట్లు..

పెట్రో ఉత్పత్తులపై ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌- జులై మధ్య రూ.1 కోట్లకు పైగా ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రాబడి వచ్చినట్లు సీజీఏ డేటా పేర్కొంటోంది. గతేడాది ఇదే నాలుగు నెలల కాలానికి రూ.67,895 కోట్లు సమకూరింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సారి వసూలైన మొత్తం రూ.32,492 కోట్లు అదనం. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆయిల్‌ బాండ్లకు గానూ కేంద్రం చెల్లించాల్సింది రూ.10వేల కోట్లు. అంటే ఆయిల్‌ బాండ్లకు చెల్లించాల్సిన మొత్తం కంటే కేవలం నాలుగు నెలల్లో అదనంగా సమకూరిన మొత్తమే మూడు రెట్లు అధికం అన్నమాట! ఆయిల్‌ బాండ్లకు రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌ పేర్కొనగా.. ఈ నెల 2న (రాహుల్‌ విమర్శలపై స్పందిస్తూ) ఆ మొత్తం రూ.1.5 లక్షల కోట్లు అని హర్దీప్‌సింగ్‌ పూరి పేర్కొనడం గమనార్హం.

ఆయిల్‌ బాండ్లకు చెల్లించాల్సింది ఎంత..?

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రాయితీపై ఇంధనం సరఫరా చేయడానికి ప్రభుత్వ రంగ రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లను జారీ చేశారు. అందులో రూ.3,500 కోట్ల అసలు కింద కేంద్రం చెల్లించింది. ఇంకా చెల్లించాల్సింది రూ.1.3లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోగా చెల్లించాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇది వరకే పేర్కొంది. ఆ లెక్కన ఈ ఏడాది (2021-22)లో రూ.10వేల కోట్లు చెల్లించాలి. ఇక 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.

మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఇప్పటికే కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020-21 మధ్య పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3.35 లక్షల కోట్లు సమకూరింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1.78లక్షల కోట్లుగా ఉంది. అంటే 88 శాతం మేర పెరిగినట్లు ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్రమే పేర్కొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు రోజువారీ ధరల సవరణతో ఇప్పుడు సామాన్యులపై భారం పడుతోంది. ఈ భారం నుంచి ఊరట కల్పించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్న వేళ ఆయిల్‌ బాండ్లను కేంద్రం తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం!!

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details