తెలంగాణ

telangana

ETV Bharat / business

'ప్రభుత్వం ఈసారి ఆర్​బీఐ నుంచి అప్పు చేయాలి' - ద్రవ్యలోటుపై కోరనా ప్రభావం

కరోనా వల్ల ఏర్పడిన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ద్రవ్య లోటును అధిగమించేందుకు కేంద్రం ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకోవడం అవసరమని ప్రముఖ ఆర్థికవేత్త చరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం సంకోచించాల్సిన పని లేదని 'ఈటీవీ భారత్​'తో చెప్పారు. కరోనా నేపథ్యంలో త్వరలో రానున్న కేంద్ర బడ్జెట్​ అసాధారణమైందని పేర్కొన్నారు.

fiscal deficit Expectations for this fiscal
ఆర్​బీఐ నుంచి ప్రభుత్వం అప్పు తీసుకోవాలి

By

Published : Jan 7, 2021, 6:14 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ద్రవ్యలోటు జీడీపీలో 6% నుంచి 7% మధ్య నమోదవ్వచ్చని అంచనాలు వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వానికి ఆర్థిక వేత్తలు కీలక సూచనలు చేస్తున్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఇలాంటి క్లిష్ణ పరిస్థితుల్లో కేంద్రం రిజర్వ్ బ్యాంక్ (ఆర్​బీఐ) నుంచి నేరుగా అప్పు తీసుకుంటే మేలని అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21కి గాను ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు (జీడీపీలో 3.5 శాతం)గా నమోదవ్వచ్చని అంచనా వేశారు. అయితే కరోనా మహమ్మారి ఈ లెక్కలను తారుమారు చేసింది.

కొవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వం అధికంగా ఖర్చులు చేయడం అనివార్యమైంది. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం పరిశ్రమ వర్గాలకు రాయితీలు ఇవ్వడం వంటి చర్యలతో ఆదాయం భారీగా తగ్గింది. ఫలితంగా ద్రవ్యలోటు అంచనాలు దాటింది.

ఈ పరిస్థితులు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాలు 50 శాతానికి పెరిగేందుకు కారణమయ్యాయి. బడ్జెట్​లో ప్రభుత్వ రుణాలు రూ.8 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. ఇప్పుడవి రూ.12 లక్షల కోట్ల వరకు చేరొచ్చనే అభిప్రాయలు వస్తున్నాయి.

ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త, ఎగ్రో ఫౌండేషన్​ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్​ చరణ్ సింగ్ కేంద్రానికి కీలక సూచనలు చేశారు.

'ప్రభుత్వం ఎప్పటిలానే రుణాలు తీసుకోవాలి.. అయితే ఆ రుణాలు ఈ సారి రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకుంటే మేలని భావిస్తున్నా.' అని 'ఈటీవీ భారత్​'తో అన్నారు చరణ్ సింగ్. ప్రభుత్వం ఆర్​బీఐ నుంచి రుణం తీసుకునేందుకు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

చరణ్​ సింగ్​ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​లో)లో సీనియర్ ఆర్థికవేత్తగా, ఆర్​బీఐలో పరిశోధన విభాగ డైరెక్టర్​గా పని చేశారు.

చరణ్ సింగ్, ప్రముఖ ఆర్థికవేత్త

అప్పుతో ద్రవ్యోల్బణ భారమా?

కేంద్రం తీసుకునే నిర్ణయాలతో ద్రవ్యోల్బణ భారం పడుతుందన్న వాదనలను కొట్టిపారేశారు చరణ్​ సింగ్. ఇంతకు ముందెన్నడూ రుణాలు తీసుకోవడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

డిసెంబర్​ నెల​ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షలో.. ధరల పెరుగుదల కారణంగా వినియోగదారు ద్రవ్యోల్బణం సెప్టెంబర్​లో 7.3% గా, అక్టోబర్​లో 7.6%గా నమోదైనట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్ తెలిపారు.

అసాధారణ బడ్జెట్..

త్వరలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్​ అసాధారణమైనదని చరణ్ సింగ్ పేర్కొన్నారు. పబ్లిక్ ఫినాన్స్ పరంగా చూస్తే.. కొవిడ్ 19 మహమ్మారి అనేక సవాళ్లను ముందుంచిందని పేర్కొన్నారు. 1918లో వచ్చిన స్పానిష్​ ప్లూ కూడా 18 నెలల పాటు కొనసాగిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

పన్ను వసూళ్లు అనుకున్నంత లేకపోయినా.. ప్రజలకు ఇలాంటి సమయాల్లో రాయితీలు, ఔషధాలు, ఆహారం వంటివి అందించాల్సి ఉంటుందని వివరించారు.

కరోనా దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో రూ.6.88 లక్షల కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే జరిగాయి. బడ్జెట్ సమయంలో ఈ సమయానికి రూ.16 లక్షల కోట్లకుపైగా వసూలవుతాయని కేంద్రం ఆశలు పెట్టుకుంది.

'ఆర్థిక వృద్ధి ఇంకా బలహీనంగా ఉంది. ఆదాయం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యయాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి.' అని చరణ్ సింగ్ వివరించారు.

సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయనేది ఎవ్వరికీ తెలియని ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ రూపకల్పన అంత సులువైన పనేం కాదని చరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇదో ప్రత్యేక బడ్జెట్​ కానుందని అన్నారు.

ఇది మంత్రి సమస్య మాత్రమే కాదు..

కరోనా మహమ్మారి ఆర్థిక మంత్రికి మాత్రమే సమస్య కాదన్నారు చరణ్ సింగ్. గత రెండేళ్ల నుంచి (కరోనా ముందు నుంచి) భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్​కు గానీ, ప్రపంచ దేశాలన్నిటికి గానీ బడ్జెట్ లోటు నిబంధనలు వర్తించవని చరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

'ద్రవ్య లోటు జీడీపీలో 3శాతంగా, రుణాలు జీడీపీ నిష్పత్తిలో 60 శాతంగా ఉండాలన్న నిబంధన తీసుకొచ్చినవారే ఇప్పుడు దాన్ని పక్కనబెట్టారు. పాశ్చాత్య దేశాలు దాని ఊసే ఎత్తడం లేదు.' అని చరణ్ సింగ్ వివరించారు.

ఇదీ చూడండి:'ఖర్చులు పెంచితేనే ఆర్థిక వృద్ధి'

ABOUT THE AUTHOR

...view details