మూడు ప్రాధాన్యాంశాల్లో ప్రజా సంక్షేమం ఒకటని ఉద్ఘాటించిన కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకర రీతిలో కేటాయింపులు జరిపింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై 1, 54,775 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది.
రూ. 15 లక్షల కోట్ల పరపతి
వ్యవసాయ రుణాలను 11 శాతం మేర పెంచి రూ. 15 లక్షల కోట్లను రైతులకు పరపతిగా అందించాలని సంకల్పించింది. ఇంతకుముందు ఉన్న 9 శాతం వడ్డీని 2 శాతానికి మార్చనుంది. ఎన్బీఎఫ్సీలతో సహా నాబార్డ్ రీఫైనాన్స్ పథకం ద్వారా వ్యవసాయ రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది.
16 అంశాలతో కార్యాచరణ
వ్యవసాయానికి ప్రోత్సాహం, రైతు సంక్షేమం కోసం 16 అంశాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది కేంద్ర సర్కారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో కిసాన్ రైలును భారత రైల్వేల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ రైల్లో శీతల గిడ్డంగి సౌకర్యం కల్పించి పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఆయా ప్రాంతాలకు చేర్చనుంది.
"6.11 కోట్లమంది రైతులకు వ్యవసాయ బీమా కల్పించాం. తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం కల్పించే దిశగా సూక్ష్మ వ్యవసాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. సుస్థిర వ్యవసాయ విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మా ప్రణాళికలో భాగం. ఇవి సాధించేందుకు రాష్ట్రప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సి ఉంది. 16 అంశాల కార్యాచరణ ప్రణాళిక మా చిత్తశుద్ధిని తెలుపుతుంది."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
గ్రామీణ మహిళ.. ఇక ధాన్యలక్ష్మి
స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామ గిడ్డంగి పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం. దీనిద్వారా మహిళలను ధాన్యలక్ష్మిగా మార్చనుంది. ఈ పథకం ద్వారా పంట అనంతర వ్యయాన్ని తగ్గించేందుకు చేయూత అందించనుంది.
రూ. లక్ష కోట్ల విలువైన చేపల ఎగుమతే లక్ష్యం
చేపల పెంపకంలో 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికల్లా 200 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు సంకల్పించింది కేంద్రం. 2024-25 కల్లా చేపల ఎగుమతిలో రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చేపల పెంపకంలో మరింత పురోగతిని సాధించేందుకు 3477మంది యువతీ, యువకులకు 'సాగరమిత్ర'లుగా ప్రోత్సాహం అందించనుంది కేంద్రం.