దేశీయంగా తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈసారి బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రకాల ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫర్నీచర్ తయారీలో ఉపయోగించే చెక్క, స్వాన్ ఉడ్, హార్డ్ బోర్డ్ లాంటి ముడిపదార్థాలతో పాటు రాగి ఉత్పత్తులకు ఉపయోగించే ముడిసరకులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.
"ముడి పదార్థాలపై అధిక ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. మన దేశం నుంచి ఫర్నీచర్ ఎగుమతులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఫర్నీచర్ ముడి పదార్థాలపై సుంకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తారు, రాగి తుక్కు తదితర వాటిపైనా దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశముంది" అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.